10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు..106 మంది అరెస్టు

10 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు..106 మంది అరెస్టు

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ)పై దర్యాప్తు సంస్థలు పంజా విసిరాయి. టెర్రర్ కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ లీడర్లపై ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. 10 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఆఫీసులు, రాష్ట్ర, జిల్లా స్థాయి లీడర్ల ఇండ్లలో రెయిడ్స్ చేసి.. 106 మంది లీడర్లు, కార్యకర్తలను అరెస్టు చేశాయి. టెర్రరిస్టు శిబిరాలను నిర్వహించడంలో, టెర్రర్​ కార్యకలాపాల్లో చేరాలంటూ యువతను ప్రోత్సహించడంలో వీరు నిమగ్నమై ఉన్నారనే అనుమానంతో అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థల అధికార వర్గాలు వెల్లడించాయి. ‘‘కీలక సమాచారం దొరికిన తర్వాతే సోదాలు చేపట్టాలని నిర్ణయించాం. టెర్రర్ ఫండింగ్, ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించడం, పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐలో చేరేలా యువతను రాడికలైజ్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆఫీసులు, ఇండ్లలో రెయిడ్స్ చేశాం” అని తెలిపాయి. ఇది ఇప్పటిదాకా ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ చరిత్రలో ఎన్నడూ లేని అతిపెద్ద ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ అని 
అధికారులు చెప్పుకొచ్చారు.

అర్ధరాత్రి దాటాక ఏక కాలంలో..

ఎన్ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌‌‌‌‌‌‌‌, సెంట్రల్ ఆర్మ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ పోలీస్ ఫోర్స్‌‌‌‌‌‌‌‌తోపాటు రాష్ట్రాల పోలీసులతో కలిసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. యాంటీ టెర్రర్ రెయిడ్స్ నిర్వహించింది. బుధవారం అర్ధరాత్రి దాటాక 1 గంట నుంచి మొదలైన సోదాల్లో మొత్తం 1,500 మంది ఆఫీసర్లు పాల్గొన్నారు. గురువారం మధ్యాహ్నం దాకా సాగిన ఈ దర్యాప్తు ప్రక్రియ.. ఇప్పటిదాకా దేశ చరిత్రలో అతిపెద్దదని ఆఫీసర్లు చెప్పారు. పలు డ్యాక్యుమెంట్లు, 100 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, పుస్తకాలు, కంప్యూటర్లు, ఇతర మెటీరియల్స్‌‌‌‌‌‌‌‌ను 
సీజ్ చేసినట్లు తెలిపారు.  

ఏ రాష్ట్రంలో ఎంత మంది?

కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పుదుచ్చేరిలో రెయిడ్స్ జరిగాయి. కేరళలో 22 మంది, మహారాష్ట్ర, కర్నాటకలో 20 మంది చొప్పున, తమిళనాడులో 10 మంది, అస్సాంలో 9 మంది, యూపీలో 8 మంది, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో నలుగురు, ఢిల్లీ, పుదుచ్చేరిలో ముగ్గురు చొప్పున, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరిని అరెస్టు చేశారు. పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఢిల్లీ చీఫ్ ప్రవేజ్ అహ్మద్‌‌‌‌‌‌‌‌ను ఉదయాన్నే అరెస్టు చేశారు.

పలు చోట్ల నిరసనలు.. అరెస్టులు

కర్నాటకలో ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా ఎస్‌‌‌‌‌‌‌‌డీపీఐ, పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. ‘ఎన్‌‌‌‌‌‌‌‌ఐఏ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్ఐఏ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అరెస్టు చేశారు. కేరళలోనూ ర్యాలీలు తీశారు. శుక్రవారం కేరళలో బంద్​కు పీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ పిలుపునిచ్చింది.

నిరంకుశ పాలకులకు తలొగ్గం: పీఎఫ్ఐ

అసమ్మతి స్వరాలను అణచివేసేందుకు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించుకునే ఫాసిస్ట్ ప్రభుత్వ ఎత్తుగడలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పీఎఫ్‌‌‌‌ఐ చెప్పింది. నిరంకుశ పాలకుల చర్యలకు తాము ఎన్నటికీ తలొగ్గబోమని చెప్పింది. ‘‘దేశవ్యాప్తంగా జరుగుతున్న సోదాలను, అన్యాయంగా చేస్తున్న అరెస్టులను, పీఎఫ్‌‌‌‌ఐ జాతీయ, రాష్ట్ర స్థాయి లీడర్లను వేధించడాన్ని ఖండిస్తున్నాం. సంస్థ సభ్యులు, మద్దతుదారులను వేటాడుతున్నారు” అని పీఎఫ్‌‌‌‌ఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఓ ప్రకటనలో పేర్కొంది.