చెత్త తగలబెట్టినందుకు 1700 మందికి రూ.26 లక్షల ఫైన్

చెత్త తగలబెట్టినందుకు 1700 మందికి రూ.26 లక్షల ఫైన్

ఢిల్లీలో రోజు రోజుకీ గాలి కాలుష్యం పెరిగిపోతోంది. సిటీలోని కొన్ని ఏరియాల్లో పొల్యూషన్ దెబ్బకి జనం బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోతోంది. దీంతో పొల్యూషన్ కంట్రోల్‌కు ఏ చిన్న మార్గాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ సమయంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలను బ్రేక్ చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్. చెత్త తగలబెడుతూ ఎయిర్ పొల్యూషన్‌కు కారణమైన 1702 మందికి రూ.26.43 లక్షల మేర ఫైన్ విధిస్తూ చలానాలు పంపింది. ఈ మొత్తం అక్టోబర్ 1 నుంచి 17వ తేదీ మధ్య నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించిన చలానాలే. అలాగే ఎక్కడపడితే అక్కడ చెత్తను పారబోస్తూ డస్ట్ పొల్యూషన్‌కు కారణమైన మరో 59 మందికి రూ.12 లక్షల చలానాలు విధించింది. కాగా, చెత్త తగలబెట్టడం లేదా ఎక్కడపడితే అక్కడ పారబోయడం ద్వారా పొల్యూషన్‌కు కారణమైతే రూ.20 వేల నుంచి లక్ష వరకు ఫైన్ విధించేలా 2016లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధన పెట్టింది.

ఎయిర్ క్వాలిటీ లెవల్స్ దారుణంగా పడిపోతుండడంతో పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే డీజిల్, కిరోసిన్, పెట్రోల్‌తో నడిచే జనరేటర్ల వాడకాన్ని నిషేధించింది. ఆస్పత్రులు, ఇతర ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే కరెంట్ పోయినప్పుడు జనరేటర్లను వాడుకునే వీలు కల్పించింది. అలాగే  ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడినప్పుడు వెహికల్స్ నడిపేవాళ్లు ఇంజన్ ఆపేయాలని కోరుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ‘రెడ్ లైట్ ఆన్.. గాడీ ఆఫ్’ అంటూ క్యాంపెయిన్ ప్రారంభించారు. మరోవైపు దుమ్ము రేగకుండా ఉండేందుకు సిటీలో రోజూ 134 వాటర్ స్ప్రిక్లింగ్ ట్యాంకర్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రతి రోజూ ఈ ట్యాంకర్లు 1340 కిలోమీటర్ల మేర నీళ్లను చల్లుతూ డస్ట్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేస్తున్నాయి. అలాగే 18 మెకానికల్ రోడ్ స్వీపర్స్‌ ఏర్పాటు చేసి రోడ్లను ఎప్పటికప్పుడు దుమ్మ లేకుండా శుభ్రం చేసేలా ఏర్పాటు చేశారు అధికారులు. ఈ మెషీన్లు రోజూ సుమారు 650 కిలో మీటర్ల మేర ఊడుస్తున్నాయి.