
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఓ బోర్డింగ్ స్కూల్‌లో ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటనలో 8వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులు సీనియర్ల చేతిలో గాయపడ్డారు. 530 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు ఉన్న బోర్డింగ్ స్కూల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంగ్లాంగ్ జిల్లాలోని బోర్డుమ్సాలోని జవహర్ నవోదయ విద్యాలయంలో జూన్ 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
11వ తరగతి చదువుతున్న విద్యార్థులు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులను రాగింగ్ పేరుతో బెదిరింపులకు దిగారు. ఈ ఘటనలో విద్యార్థుల శరీరంపై గాయల గుర్తులు కనిపించాయి. ఈ ఘటన చర్చనీయాంశంగా మారడంతో ఏర్పాటు చేసిన క్రమశిక్షణా కమిటీ సమావేశంలో ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజీవ్ రంజన్ వెల్లడించారు.
శారీరక వేధింపులకు గురై గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై బుధవారం పేరెంట్ టీచర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సస్పెండ్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు.