కెనడా, యూఎస్‌ల్లో తీవ్ర ఎండలు.. 200 మంది మృతి

కెనడా, యూఎస్‌ల్లో తీవ్ర ఎండలు.. 200 మంది మృతి

ఒట్టావా: కెనడా, అమెరికాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా భానుడి భగభగలకు కెనడా అల్లాడిపోతోంది. వేడి గాలుల బారిన పడి ఆ దేశంలో ఇప్పటికే 233 మందికి పైగా మృతి చెందారని తెలుస్తోంది. గత నాల్రోజులుగా కెనడాలో రికార్డు స్థాయిలో 49.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్, ఓరెగన్, సియాటెల్, వాషింగ్టన్ సిటీల్లో కూడా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవతున్నాయి. సోమవారం పోర్ట్‌ల్యాండ్‌లో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ప్రజలను అప్రమత్తం చేసింది. ఎయిర్ కండీషనింగ్ (ఏసీ) ఉన్న భవనాల్లోనే ఉండాలని.. బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని, నీళ్లు బాగా తాగాలని సూచించింది. కాగా, తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడిన కార్చిచ్చుతో కాలిఫోర్నియా, ఒరెగాన్ బార్డర్‌లో దాదాపు 1,500 ఎకరాల అడవులు కాలిపోయాయి.