ఒక్క పేషంట్ కూడా హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదు

ఒక్క పేషంట్ కూడా హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదు

కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో కరోనా రోగులకు వెంటిలేటర్లు, ఐసీయూ, ఆక్సిజన్ తో కూడిన బెడ్ల సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో అన్నిఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి గంగులతో కలిసి ఆక్సిజన్ గ్యాస్ సప్లై యూనిట్, RTPCR ల్యాబ్ ను ప్రారంభించారు ఈటల. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
 
కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక్క పేషంట్ కూడా హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలు చేపట్టినట్లు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. 20కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ను ఇక్కడ ఏర్పాటు చేసామన్నారు. ఇది ఒక్కసారి నింపితే 7 రోజుల పాటు పనిచేస్తుందన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఈ ట్యాంకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ర్యాపిడ్ టెస్టులతో కొన్ని సార్లు సరైన ఫలితాలు రావడం లేదని.. 400 టెస్టుల సామర్థ్యంతో ఇవాల్టి నుంచి కరీంనగర్ లో RTPCR పరీక్షల ల్యాబ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనికి మరిన్ని ఆటోమెటిక్ మిషన్లు యాడ్ చేస్తే 1000 నుంచి 2000 టెస్టులు చేసే అవకాశం ఉంటుందన్నారు. కొన్ని సార్లు ఫలితాలు లేటైనా... సిమ్టమ్స్ ఉంటే వెంటనే ట్రీట్ మెంట్ చేయాలని డాక్టర్లకు సూచించామన్నారు.

గాలిలో కరోనా వైరస్ మాత్రమే ఉన్నందున్న ఇప్పుడొచ్చే లక్షణాలన్నీ కరోనాకు సంబంధించినవనే గుర్తించాలన్నారు ఈటల. ఎవరైతే టెస్టులు చేసుకుని పాజిటివ్ వచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారో, టెస్టులు చేసుకోకుండా ఆలస్యం చేస్తున్నారో అలాంటి వారే చనిపోతున్నారని తెలిపారు. మొదటి వేవ్ లో మాదిరిగానే  మోర్టాలిటీ రేటు ఇప్పుడు కూడా 0. 5 మాత్రమే ఉందన్నారు. అయితే కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మరణాలు అనిపిస్తున్నాయని చెప్పారు. ప్రాథమిక దశలోనే రోగాన్ని నిర్ధారించుకుని ట్రీట్ మెంట్ తీసుకున్నవాళ్లలో మరణాలు ఉండవన్నారు. అధిక బరువు, నీడ పట్టున పనిచేసుకుని బలహీనంగా ఉండే వాళ్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు మంత్రి ఈటల. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రమే ఆక్సిజన్ కొరత ఉందని.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా కొరత లేదన్నారు. ఆర్మీ ఫ్లైట్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్ తెప్పిస్తున్నామని తెలిపారు. విశాఖ స్టీల్,  బల్లారి స్టీల్ నుంచి కేటాయించాల్సిన ఆక్సిజన్ ను మనకు ఒడిషా నంచి కేటాయించారని చెప్పారు. ఇకపై ఎక్కడా ఆక్సిజన్ కొరత లేకుండా, బ్లాక్ చేయకుండా కఠన చర్యలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమ్ డిసివిర్ కొరత లేదన్నారు. 

వైద్య సిబ్బంది ఎంత మంది అవసరమున్నా రిక్రూట్ చేసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని తెలిపారు. ఇతర సర్వీసులు బంద్ చేసైనా పూర్తి స్థాయి వైద్య సిబ్బందిని కరోనా చికిత్సకు ఉపయోగిస్తామని చెప్పారు. పేషంట్లు అనవసరంగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు మంత్రి ఈటల రాజేందర్.