
ముంబై: హోటల్-బుకింగ్ స్టార్టప్ ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ ఐపీఓకు వస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 8,430 కోట్లను సేకరించేందుకు సెబీకి డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను అందజేసింది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ , ఎయిర్‌బీఎన్‌బీ కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్లతో నడుస్తున్న ఈ కంపెనీ ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ. 7వేల కోట్లను సమీకరిస్తుంది. మిగిలిన షేర్లను ప్రస్తుత స్టాక్ హోల్డర్లు అమ్ముతారు. ఈ స్టార్టప్ వాల్యుయేషన్ సుమారు 9 బిలియన్ డాలర్ల వరకు ఉంది. ఇది భారతదేశంలో మూడవ అత్యంత విలువైన స్టార్టప్ కూడా. ఓయో ఫౌండర్, ఈయన హోల్డింగ్ కంపెనీ ఆర్ఏ హాస్పిటాలిటీ హోల్డింగ్స్ , సాఫ్ట్ బ్యాంక్ విజన్ ఫండ్ ఇందులో అతిపెద్ద వాటాదారులు. సాఫ్ట్ బ్యాంకుకు 46 శాతం వాటా ఉండగా, అగర్వాల్ , ఆయన హోల్డింగ్ కంపెనీకి 33 శాతం వాటా ఉంది. కొవిడ్ కారణంగా హోటల్, పర్యాటక పరిశ్రమలు దెబ్బతినడంతో ఓయోకు ఇబ్బందులు వచ్చాయి. ఈ ఏడాది జూలైలో ఫుడ్ డెలివరీ స్టార్టప్ జోమాటో లిమిటెడ్ ఐపీఓకు వచ్చాక.. తానూ స్టాక్ మార్కెట్‌కు వెళ్లాలని ఓయో నిర్ణయించుకుంది. డిజిటల్ చెల్లింపుల స్టార్టప్ పేటీఎం, బ్యూటీ ఉత్పత్తుల స్టార్టప్ నైకా కూడా ఐపీఓకు రెడీ అవుతున్నాయి. దేశంలో అత్యంత విలువైన స్టార్టప్ అయిన ఎడ్‌టెక్ బైజు వచ్చే ఏడాది పబ్లిక్ ఇష్యూకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.