
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన శైలేష్ జెజురికర్‌ను అమెరికా ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీఅండ్‌జీ) తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా నియమించింది. ఆయన వచ్చే జనవరిలో ఈ పదవిని స్వీకరిస్తారు. ప్రస్తుతం కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా (సీఓఓ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడున్న సీఈఓ జాన్ మోయెల్లర్ స్థానంలో శైలేష్ జెజురికర్ వస్తారు.
జాన్ మోయెల్లర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. 187 ఏళ్ల కంపెనీ చరిత్రలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి సీఈఓగా బాధ్యతలు స్వీకరించడం ఇదే మొదటిసారి. ముంబైలో జన్మించిన 58 ఏళ్ల శైలేష్ జెజురికర్, లక్నో ఐఐఎంలో చదివారు. 1989లో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా పీ అండ్ జీ చేరిన ఆయన, అప్పటి నుండి వివిధ కీలక పదవుల్లో పనిచేశారు. ఫ్యాబ్రిక్ కేర్, హోమ్ కేర్ వంటి కీలక విభాగాలకు నాయకత్వం వహించి, కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు.