పాదయాత్రల సీజన్​ స్టార్టయింది

పాదయాత్రల సీజన్​ స్టార్టయింది
  • ఈయన చేస్తడట.. ఇంకొకామె చేస్తదట
  • పాదయాత్రలతోనైనా వాళ్ల ఆరోగ్యం కుదుటపడ్తది: కేటీఆర్​
  • రేవంత్​ పీఎం పదవి పొందినంత బిల్డప్​ ఇస్తున్నడు
  • నోట్ల కట్టలతో దొరికి చిప్పకూడు తిన్నోడు నీతులు చెప్తున్నడు
  • మొరిగే కుక్కలను, కుసంస్కారిని పట్టించుకోం
  • దుబ్బాక గెలుపుతో బీజేపీ ఎగిరెగిరి పడింది
  • నాలుగు రోజులు కేసీఆర్‌ బయట తిరిగితే అందరినోళ్లు మూతపడ్డాయని కామెంట్​
  • టీఆర్​ఎస్​లో చేరిన బీఎంఎస్​ నేత కెంగెర్ల మల్లయ్య

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో పాదయాత్రల సీజన్​ స్టార్టయిందని మంత్రి కేటీఆర్​ విమర్శించారు. ‘‘బీజేపీ అధ్యక్షుడు పాద యాత్ర చేస్తున్నట్లు డిక్లేర్​ చేసిండు. ఇగ పోటాపోటీ పాదయాత్రల సీజన్​ స్టార్టయింది తెలంగాణల. ఈయన చేస్తడట.. ఇంకొకాయన చేస్తడట.. ఇంకొకామె చేస్తదట.. ఇంకొకాయన కూడా చేస్తడట. ఇంకా చాలా మంది ఉన్నరు లైన్ల. నలుగురైదుగురు ఉన్నరు. అలాంటి వాళ్లకు పాదయాత్రతో కరోనా తర్వాత కనీసం ఆరోగ్యమైన కుదుట పడుతది” అని ఎద్దేవా చేశారు. వాళ్ల యాత్రలతోనైనా తమ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి తెలిసి వస్తుందన్నారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆగమాగం బ్యాచ్‌లా పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి తీరు ఉందని, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు చిన్న పదవి రాగానే ప్రధానమంత్రి పదవి వచ్చినట్టుగా బిల్డప్‌ ఇస్తున్నారని కేటీఆర్​ విమర్శించారు. మొరిగే కుక్కలను, కుసంస్కారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఎంఎస్‌ నాయకుడు కెంగెర్ల మల్లయ్య గురువారం తెలంగాణ భవన్​లో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం గుంజుకుంటే వచ్చేది కాదని, ప్రజలిస్తేనే వస్తుందన్నారు. ‘‘నోట్లకట్టలతో అడ్డంగా దొరికి చిప్పకూడు తిన్న దరిద్రుడు నీతులు చెప్తున్నడు. పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టాలని అంటున్నడు. ఆయన పార్టీ మారారు కదా ఏ రాయితో కొట్టాలి” అని రేవంత్​పై కేటీఆర్​ మండిపడ్డారు. రాజస్థాన్‌లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న అశోక్‌  గెహ్లాట్‌ను ఏ రాయితో కొట్టాలో చెప్పాలని ప్రశ్నించారు.కేసీఆర్‌ పేరు పలికే అర్హత రేవంత్‌కు లేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను తెలంగాణ బలిదేవతన్న రేవంత్‌ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడని, కొన్ని రోజులకు చంద్రబాబును తెలంగాణ తండ్రి అంటాడని విమర్శించారు. రేవంత్​కు టీడీపీ వాసనలు ఇంకా పోలేదని, పీసీసీని తెలుగుదేశం కాంగ్రెస్‌ అని కాంగ్రెస్​ నేతలే అంటున్నారని వ్యాఖ్యానించారు.  ‘‘కేసీఆర్‌ అనే మహానేత నడుస్తుంటే కొంతమంది బిచ్చగాళ్లు మొరుగుతున్నరు.  ఆయనను తిట్టి శునకానందం పొందుతున్నరు. టీవీల్లో బ్రేకింగ్‌ న్యూస్‌ల కోసం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నరు. ముందు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలి. డైలాగ్‌లతో కేసీఆర్​ను ఢీ కొట్టలేరు.  కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ఆయన కన్నా ఎక్కువగా తెలంగాణ ప్రజలను ప్రేమించాలి” అని అన్నారు.

బీజేపీ ఎగిరెగిరి పడింది
దుబ్బాక గెలుపుతో బీజేపీ ఎగిరెగిరి పడిందని, పాలపొంగులాంటి గెలుపును చూసి మిడిసిపడిందని, నాగార్జునసాగర్‌లో ఆ పార్టీకి డిపాజిట్‌ కూడా దక్కలేదని  కేటీఆర్​ విమర్శించారు. జానారెడ్డి లాంటి నేతను నాగార్జునసాగర్​లో ఓ కుర్రోడు ఓడించాడని ఆయన అన్నారు. 77 నియోజకవర్గాల పరిధిలో జరిగిన రెండు ఎమ్మెల్సీ సీట్లను తమ పార్టీనే గెలుచుకుందని చెప్పారు. ‘‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు అమలు చేస్తున్నారా? పల్లెల్లో ట్రాక్టర్లు, డంపింగ్‌ యార్డులు ఉన్నాయా?” అని ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరో చెప్పాలన్నారు. అక్బర్‌ - బాబర్‌ కథలు చెప్పడం మానుకొని, రాష్ట్రానికి బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. సింగరేణి కార్మికుల కోసం చేసిన తీర్మానం ఎందుకు అమలు చేయడం లేదన్నారు. హుజూరాబాద్‌కు బీజేపీ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఇస్తామంటే తాము వద్దన్నామా అని ప్రశ్నించారు. నాలుగు రోజులు కేసీఆర్‌ బయట తిరిగితే అందరినోళ్లు మూతపడ్డాయని కేటీఆర్​ అన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, రాబోయే ఎన్నికల్లో కార్మికులు పార్టీతో కలిసి పనిచేయాలన్నారు. కొంత విరామం తర్వాత కెంగెర్ల మల్లయ్య మళ్లీ పార్టీలోకి వస్తున్నారని, అక్కడ పనిచేయడానికి మనసొప్పకనే మళ్లీ పార్టీలోకి తిరిగి వస్తున్నారని ఆయన తెలిపారు. తప్పిపోయినోళ్లు తిరిగి సొంతగూటికి చేరినట్టుగా ఉందన్నారు. 30 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుల ప్రభావం ఉంటుందని తెలిపారు. కార్మిక నేతల మధ్య స్వల్ప విభేదాలు ఉంటే తొలగించుకొని కలిసికట్టుగా పనిచేయాలన్నారు.