ఖరీఫ్​ ప్రణాళిక ఖరారు.. వనపర్తి జిల్లాలో పెరగనున్న వరి, వేరుశనగ సాగు

ఖరీఫ్​ ప్రణాళిక ఖరారు.. వనపర్తి జిల్లాలో పెరగనున్న వరి, వేరుశనగ సాగు
  •     ఈ ఏడాది 2.41 పంటల సాగు చేస్తారని అంచనా
  •     విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా ప్లాన్

వనపర్తి, వెలుగు: జిల్లాలో వానాకాలం పంటల సాగుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళికను ఖరారు చేసింది. వనపర్తి జిల్లాలో 2,61,488 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. వరి, పత్తి, కందులు, మొక్కజొన్న, వేరుశనగ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు కానున్నాయి. గతంలో మాదిరిగానే ఈ వానాకాలంలోనూ వరి పంట విస్తీర్ణం 5 శాతం పెంచారు. ఈ ఏడాది వానలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటకు మొగ్గు చూపే అవకాశముందని వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

ముందస్తుగా పంటల సాగు..

ప్రతి ఏడాది యాసంగిలో పంటలు ఆలస్యంగా చేతికొస్తుండడం, ఆ సమయంలో జూరాల వంటి ప్రాజెక్టుల కింది చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వానాకాలంలో పంటలను నెల రోజులు ముందుగా వేయించేలా వ్యవసాయాధికారులు ప్లాన్​ చేస్తున్నారు. ఈ మేరకు అగ్రికల్చర్​ ఆఫీసర్లు తమ పరిధిలోని రైతులకు అవేర్నెస్​ కల్పిస్తున్నారు. 

నాలుగేళ్లుగా విత్తనాలు ఇయ్యలే..

రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలు సాగు చేసేందుకు విత్తనాలను రాయితీపై అందించేది. నాలుగేండ్లుగా రాయితీ విత్తనాలు ఇవ్వడం లేదు. పచ్చిరొట్ట ఎరువులకు తప్ప ఇతర పంటలకు రాయితీ ఇవ్వకపోవడంతో రైతులు ఓపెన్​ మార్కెట్​లోనే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడంతో విత్తనాలు సబ్సిడీపై అందించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

కావాల్సిన ఎరువులు..

ఈ ఏడాది పంటల సాగుకు 55,650 మెట్రిక్​ టన్నుల ఎరువులు అవసరం అని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. 26,001 మెట్రిక్​ టన్నుల యూరియా, 9161 మెట్రిక్​ టన్నుల డీఏపీ, 3286 మెట్రిక్​ టన్నుల ఎంవోపీ, 13,100 మెట్రిక్​ టన్నుల కాంప్లెక్స్, 3908 మెట్రిక్​ టన్నుల ఎస్ఎస్పీ అవసరమని భావిస్తున్నారు. పంటల సాగు ప్రారంభం నాటికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఇప్పటికే అగ్రికల్చర్​ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. 

దుక్కులు సిద్ధం..

ఎండలు దంచికొడుతుండడంతో ఈ సారి సీజన్​ కొంత ఆలస్యం కావచ్చని భావించిన రైతులకు నాలుగు రోజులుగా వాతావరణం చల్లబడి చినుకులు కురుస్తుండడంతో ఆశలు చిగురించాయి. రైతులు ఇప్పటికే వరి నారు పోసుకునేందుకు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. మిగిలిన పంటల సాగుకు భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.