వర్షాలకు నేలవాలిన వరి పంట

వర్షాలకు నేలవాలిన వరి పంట
  • హార్వెస్టర్లతో కోయలేని పరిస్థితి
  • కూలీలకు పెరిగిన డిమాండ్
  • ఎకరం గుండుగుత్త రూ.3,500

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాలకు వరి పొలాలన్నీ నేలవాలాయి. వీటిని మిషన్లతో కోసే వీలు లేదు. చాలా పొలాల్లో నీళ్లు నిలిచి మిషన్లు మడుల్లోకి దిగే పరిస్థితి లేదు. దీంతో తప్పని సరై కూలీలతో కోయించాల్సి వస్తోంది. సాధారణంగానే చాలా ప్రాంతాల్లో కూలీల కొరత ఉంది. ఈ సారి వాళ్ల అవసరం మరింత పెరగడంతో కూలి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి.
చెయిన్ హార్వెస్టర్‌తో కోయిస్తున్నరు
వరంగల్‌‌‌‌, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్‌‌‌‌, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఇటీవలి భారీ వర్షాలకు కోతకు వచ్చిన పొలాలు నేలవాలాయి. ఈ పొలాలను టైర్లు ఉండే హార్వెస్టర్లతో కోయడం సాధ్యం కావడం లేదు. నీళ్లున్న పొలాల్లో అవి దిగబడుతున్నాయి. దీంతో చెయిన్​ హార్వెస్టర్లతో కోయిస్తున్నారు. కానీ ఇవి అవసరానికి తగినన్ని అందుబాటులో లేవు.
పోయినేడాది రూ.250.. ఈయేడు రూ.350
గత ఏడాది వరి కోతకు రోజువారీ కూలీ రూ.250 ఉండేది. ఇప్పుడు రూ.350 వరకు తీసుకుంటున్నారు. ఇలా పెంచి ఇస్తున్నా కూలీలు దొరకడం లేదని రైతులు అంటున్నారు. పది మంది కూలీలను పెడితే రోజుకు ఎకరం కోసే వీలుంటుంది. ఇక గుండుగుత్తాకు ఇచ్చినా రూ.3,500 వరకు అడుగుతున్నారు. 

కూలీలు దొరుకుతలేరు
వానకు పొలం మొత్తం అడ్డంబడ్డది. హార్వెస్టర్లతో కోయడానికి రాట్లే. చెయిన్​ మిషన్లు దొరుకుతలేవు. కూలీలకు డిమాండ్ పెరిగింది. కూలి పెంచి ఇస్తున్నా జనం దొరకట్లే. దూరం నుంచి ఆటోల్లో తీసుకొచ్చి కోయిస్తున్నం.  - బీరయ్య, మహబూబాబాద్‌‌‌‌ జిల్లా

రూ.650 దాకా పడ్తంది
వేరే ఊర్లకు ఆటోల్లో వెళ్లి వరికోతలు కోసి వస్తున్నం. రైతుతో గుండుగుత్తగా ఎకరానికింత అని మాట్లాడుకుంటున్నం. తక్కువ మందికి ఎకరం కోస్తే ఒక్కరోజు కూలి రూ.650దాకా పడుతోంది. ఈ సీజన్‌‌‌‌లో మాకు గిట్టుబాటవుతోంది.-అనిత, మహబూబాబాద్‌‌‌‌ జిల్లా