
కొనుగోళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపులు
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నాయకులు
యాసంగిపై తేల్చాలంటూ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ లొల్లి
ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకుండా రాజకీయాలేంది?: బీజేపీ
టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నయ్: కాంగ్రెస్
ఒ క దిక్కు యాసంగి సీజన్ మొదలైనా ఇంకా వానాకాలం వడ్లు అమ్ముడుపోక రైతులు అరిగోస పడుతుంటే.. మరో దిక్కు లీడర్లు మాత్రం విమర్శలు ప్రతివిమర్శలతో పంచాది పెట్టుకుంటున్నరు.
వడ్లు కొనాల్సిన బాధ్యత మీదంటే మీదంటూ రాజకీయాలు చేస్తున్నరు. ఎక్కడికక్కడ కల్లాల్లో, కొనుగోలు సెంటర్లలో కుప్పలు కుప్పలుగా వడ్లు పేరుకుపోతున్నయి. ఎప్పుడు కొంటరా అని రైతులు మనాది పడుతున్నరు. కుప్పల మీదనే అన్నదాతల గుండెలు ఆగిపోయినయి. వానాకాలం వడ్లు చేతికొచ్చి రెండు నెలలైతున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నది 35 శాతం మాత్రమే. కోటీ 3 లక్షల టన్నుల వడ్లు కొంటామని మొదట టార్గెట్ పెట్టుకున్న రాష్ట్ర సర్కారు.. మంగళవారం వరకు కేవలం 35 లక్షల టన్నులే కొన్నది. ఇటు అమ్ముడుపోక.. అటు ఎండకు ఎండి, వానకు తడిసి వడ్లు ఖరాబైతున్నయని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. ఎప్పటికప్పుడు కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు సెంటర్లను తెరువలేదు. తెరిచిన సెంటర్లలోనూ నామ్కేవాస్తేగానే కొంటున్నరు. వానాకాలం వడ్లను పక్కనబెట్టి యాసంగి గురించి టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లొల్లి పెడ్తున్నరు. ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేయకుండా రాజకీయాలేందని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ విమర్శిస్తున్నది.
రైతుల కోసమే బాయ్‌కాట్ చేసినం
రాష్ట్రంపై కేంద్రం వివక్ష: టీఆర్ఎస్ ఎంపీలు
వడ్ల కొనుగోళ్లపై ఇక ప్రజాక్షేత్రంలో పోరాడుతం
రైతుల బాధ కేంద్రానికి అర్థమైతలేదని ఫైర్
ఎంపీ పదవులకు రాజీనామాలపై ఆలోచిస్తం: కేకే
వడ్ల కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని, రైతుల బాధను అర్థం చేసుకోవడం లేదని, అందుకే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై ఇక ప్రజాక్షేత్రంలో పోరాడుతామని తెలిపారు. కేంద్రం తీరు, యాసంగిలో పంట మార్పిడి అంశంపై రైతులకు వివరిస్తామని చెప్పారు. మంగళవారం నల్ల చొక్కాలు వేసుకొని పార్లమెంట్‌కు హాజరైన టీఆర్ఎస్ ఎంపీలు.. ధాన్యం కొనుగోళ్లపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ లోక్‌సభ, రాజ్యసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చారు. రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడగా, లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీనిపై టీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ఎంత పంట కొంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.
స్పష్టత ఇస్తలే: కేకే
ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవడంతో పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవ రావు చెప్పారు. పోరాటంతోనే రాష్ట్రం సాధించుకున్నామని, అలాగే ధాన్యం కొనుగోళ్లపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని చెప్పారు. ‘‘పార్లమెంటులో ఎంత నిరసన తెలిపినా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ధాన్యం సేకరణే రాష్ట్రంలో అతి పెద్ద సమస్య. ఏళ్లుగా సాఫీగా సాగుతున్న ప్రక్రియను కొనసాగించాలని కోరాం. రాష్ట్రంలో మిగిలిన పారాబాయిల్డ్ రైస్ తీసుకోవాలని కోరితే స్పష్టత రాలేదు. గోదాములు నిండినయని, రైల్వే ర్యాకులు ఇవ్వట్లేదని చెప్తే అర్థం చేసుకుంటలే” అని మండిపడ్డారు. ఆజ్ సే హమారా నారా.. మోడీ జారా (నేటి నుంచి మా నినాదం.. మోడీని పంపించడమే)తో ముందుకెళ్తామన్నారు. మోడీది రైతుల, పేదల వ్యతిరేక, అహంకార ప్రభుత్వమన్నారు. ఎంపీ పదవులకు రిజైన్ చేయాలా వద్దా అనేదానిపై ఆలోచిస్తామన్నారు.
రైతులను రోడ్లపైకి తెచ్చే కుట్ర: నామా
బీజేపీ నేతలు రాష్ట్ర రైతులను రోడ్లపై పడేసే కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఆరోపించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతల ప్రకటనలకు పొంతన లేదన్నారు. యాసంగిపై కేంద్ర వ్యవసాయ, వాణిజ్య శాఖల మంత్రులు వేర్వేరుగా సమాధానం ఇచ్చారన్నారు. యాసంగిలో వరి వేసుకోవడానికి ఇబ్బంది లేదని కేంద్ర వ్యవసాయ మంత్రి ఒక ప్రశ్నకు జవాబిస్తే.. యాసంగిలో వరి పంట తాము కొనబోమని వాణిజ్య మంత్రి చెప్పారన్నారు. పార్లమెంట్‌లోనూ న్యాయం జరగనందునే సెషన్ ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు చెప్పారు.
ధర్నాలు ఆపి వడ్లు కొనండి
కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలపై కిషన్‌రెడ్డి ఫైర్
కేంద్రం క్లారిటీగా చెప్పినా మీ నిరసనలేంది?
వానాకాలం పంట కొనేందుకు కేంద్రం సిద్ధం
యాసంగిపై ఫిబ్రవరిలో చర్చించండి
టీఆర్ఎస్కో, కేసీఆర్‌కో మేం భయపడం
హుజూరాబాద్‌లో ఓడినందుకే కేంద్రంపై విషప్రచారం చేస్తున్నారని మండిపాటు
వడ్లు కొనకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బియ్యం సేకరణ గురించి కేంద్రం క్లారిటీగా చెప్తున్నా టీఆర్ఎస్ ఎంపీలు ధర్నాలు, నిరసనలకు దిగడం ఏమిటని ఆయన నిలదీశారు. కావాలనే సమస్యను సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ధర్నాలు ఆపి వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. వానాకాలం పంట కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, యాసంగిపై ఫిబ్రవరిలో కేంద్ర అధికారులతో కలిసి కూర్చొని చర్చించాలన్నారు. టీఆర్ఎస్ కో, కేసీఆర్ కో బీజేపీ సర్కార్ భయపడబోదని తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ దయా దాక్షిణ్యాలతో తాము కేంద్రంలో అధికారంలోకి రాలేదని, ప్రజల మెప్పుతో వచ్చామనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు చేసిన నినాదాలు కిసాన్ బచావో అన్నట్లుగా లేవని, కేసీఆర్ బచావో అన్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై ఇందిరా పార్క్ లో కేసీఆర్, పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేయడం కన్నా... రైతుల వద్ద బియ్యం కొనుగోలు చేస్తే బాగుంటుందన్నారు. ‘‘కేసీఆర్ కు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఉంది. అందుకే ఇందిరా పార్క్ లో ఆయన, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడుతో కలిసి సకుంటుంబ సమేతంగా ధర్నా చేశారు. కేంద్రం మెడపై కత్తి పెట్టి అగ్రిమెంట్ రాయించుకుందంటున్నరు.. అట్లయితే మీది అంత మెతక ప్రభుత్వమా?” అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
ఎక్కువ సహకారం అందిస్తం
యాసంగిపై ఫిబ్రవరిలో కేంద్ర అధికారులతో చర్చించాలని రాష్ట్రానికి కిషన్‌రెడ్డి సూచించారు. అన్ని రాష్ట్రాలకు ఎలాంటి పాలసీ ఉంటుందో, అంతకన్నా మెరుగైన సాయం కేంద్రం నుంచి తెలంగాణకు తెచ్చే బాధ్యత తనదన్నారు. ఫిబ్రవరిదాకా ఏ రాష్ట్రంలో ఎంత ధాన్యం పండిస్తారో తెలియదని, అయినప్పటికీ ఫిబ్రవరిలోనూ తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం చూస్తుందని చెప్పారు. బాయిల్డ్ రైస్ రాకుండా వరి విత్తనాలు ఇవ్వాలని, రైస్ మిల్స్ లో మార్పులు తీసుకురావాలని, రైతుల్లో చైతన్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.
పథకం ప్రకారం విష ప్రచారం చేస్తున్నరు
హుజూరాబాద్ బైపోల్ ఫలితాల నెక్ట్ డే నుంచి టీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారం కేంద్రంపై విష ప్రచారం మొదలుపెట్టిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. వడ్ల కొనుగోళ్లపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో క్లియర్‌గా చెప్పారని, తాను కూడా క్లారిటీ ఇచ్చానని చెప్పారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల కోసం నిధుల్ని రూ. 3 వేల కోట్ల నుంచి రూ. 27 వేల కోట్లకు పెంచిన చరిత్ర బీజేపీదన్నారు. వచ్చే ఏడాదిలోనూ రా రైస్ చివరి గింజదాకా కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే రైతుల దగ్గర వడ్లు కొనాలని, కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు.
ముందు ఇవ్వాల్సిన బియ్యం సంగతి చూడండి
అగ్రిమెంట్ పై సంతకం పెట్టి, అంచనాలు 4 సార్లు మార్చిన గమ్యంలేని ప్రభుత్వం టీఆర్ఎస్ ది అని కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘‘రా రైస్ ఇస్తామని, బాయిల్డ్ రైస్ వేయకుండా చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. గతేడాది 24 ఎల్ఎంటీలకు బదులు 44 ఎల్ఎంటీల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నాం. మొదట కేంద్రానికి ఇవ్వాల్సిన 17 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ పని చూడండి” అని హితవుపలికారు. ఇంత వరకు జాతి ప్రయోజనాల కోసం అంశాల వారీగా పార్లమెంట్‌లో మద్దతు ఇచ్చామని, ఇకపై ఇవ్వబోమని టీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్నారంటే.. వారికి కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయని విమర్శించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ప్రొక్యూర్మెంట్ నుంచి తప్పించుకోవడం అంటే రూపాయికి కిలో బియ్యం స్కీంను రద్దు చేయాలనుకోవడమే. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల లో బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్టాక్ పెట్టుకోదా?”అని ప్రశ్నించారు.
ఇద్దరూ కలిసి డ్రామాలాడుతున్రు
మోడీ ఆదేశిస్తే.. కేసీఆర్ పాటిస్తుండు
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణ
టీఆర్ఎస్ ఎంపీల బాగోతాలు ప్రజలకు అర్థమైనయ్
పార్లమెంట్‌లో యుద్ధం చేస్తామని.. ఇప్పుడు గల్లీలకు పోతరట
గల్లీలో ఉండేదానికి ఎంపీ పదవులు ఎందుకని ప్రశ్న
‘‘9 రోజులుగా పార్లమెంట్ లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న బాగోతాలు, నాటకాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైనయ్. నేను చెప్పినట్లే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయంలో మోడీ ఆదేశిస్తే.. కేసీఆర్ పాటించారు” అని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని 18 ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో డిమాండ్ చేశాయి. దీనిపై ఏ పార్టీ కూడా వెల్‌లోకి వెళ్లి నిరసన తెలపాలని నిర్ణయించలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం వడ్ల కొనుగోళ్ల పేరుతో ఆందోళనలు చేసి బీజేపీకి సహకరించింది. మోడీ ఆదేశం ప్రకారమే ఇదంతా జరిగింది. మోడీ చేతిలో పావుగా మారిన కేసీఆర్.. రైతుల సమస్యను పక్కదారి పట్టించారు” అని మండిపడ్డారు.
కేటీఆర్‌ను తప్పించేందుకే బాయ్‌కాట్ నాటకం
హైదరాబాద్ శివారులో రూ.3 వేల కోట్ల విలువైన భూ లావాదేవీల్లో మంత్రి కేటీఆర్‌కు ఈడీ నోటీసులు రాకుండా, కుంభకోణం నుంచి తప్పించేందుకు వీలుగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వింటర్ సెషన్‌ను బాయ్‌కాట్ చేశారని రేవంత్ ఆరోపించారు. ఈ భూ కేటాయింపుల్లో కేసీఆర్‌కు సన్నిహితులకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు, సాగునీటి ప్రాజెక్టుల్లో కాంట్రాక్టులు చేస్తున్న సంస్థల యజమానులకు ఈడీ నోటీసులిచ్చిందన్నారు. రూ.3 వేల కోట్ల విలువైన భూములను రూ.300 కోట్లకే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానులు, ఓ టీవీ చానల్ యజమానులు, ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థల యజమానులు దక్కించుకున్నారని ఆరోపించారు. రూల్స్ ప్రకారం ఈ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని, కానీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. కేసీఆర్ సన్నిహితులకు కట్టబెట్టారన్నారు. దీనిపై ఈడీ ఆయా సంస్థలకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపిందన్నారు. ఈ విచారణలో కేటీఆర్ పాత్ర కీలకమని తేలిందన్నారు. కానీ బీజేపీ, టీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగా కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వకుండా ఈడీ తాత్కాలికంగా ఆపిందన్నారు. ఇందుకు బదులుగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన విరమించి, హైదరాబాద్ రావాలని కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
అగ్గి పుట్టిస్తనన్నవ్
ఢిల్లీలో యుద్ధం చేస్తానని చెప్పిన కేసీఆర్.. గత పర్యటనలో ఏమీ చేయకుండానే నాలుగు రోజుల తర్వాత రాష్ట్రానికి వచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటనలో అగ్గి పుట్టిస్తానన్న కేసీఆర్.. ఫామ్ హౌస్‌లో పడుకున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్రమే కారణమని, రైతులకు మోడీ సమాధానం చెప్పాలని కేసీఆర్ గతంలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలు.. వడ్ల కొనుగోళ్లపై సమస్యలు పరిష్కారం కాకుండానే ఎందుకు సమావేశాలను బాయ్‌కాట్ చేశారో చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో యుద్ధం చేస్తామని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు గల్లీలకు పోతామంటున్నారని ఎద్దేవా చేశారు. గల్లీలో ఉండాలంటే ఎంపీ పదవులు ఎందుకని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలపై పోరాడకుండా ఏ ముఖం పెట్టుకొని ప్రజల వద్దకు పోతరని నిలదీశారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఒప్పందం లేకపోతే వరంగల్‌లో స్టాక్ మాయం కావడంపై ఎఫ్‌సీఐ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. దీనిపై వెంటనే సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.