52.80 లక్షల ఎకరాల్లో వరి సాగు

52.80 లక్షల ఎకరాల్లో వరి సాగు

హైదరాబాద్, వెలుగు: ఈ యాసంగి సీజన్‌‌లో రాష్ట్రంలో 52.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని సర్కార్‌‌‌‌కు వ్యవసాయ శాఖ ప్రపోజ్​చేసింది. ఈ విస్తీర్ణంలో వరి సాగయ్యేలా చూస్తే 1.19 కోట్ల మెట్రిక్​టన్నుల వరి ఉత్పత్తి అవుతుందని పేర్కొంది. యాసంగిలో ఏ పంట ఎంత మేర సాగువుతుందనే దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి శనివారం పంపింది. వరితో పాటు అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 68.16 లక్షల ఎకరాల్లో సాగవుతాయని పేర్కొంది. ఇటీవల రబీలో వరి పంట వేయద్దని రైతులకు సీఎం కేసీఆర్​చెప్పారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరి సాగు తగ్గించుకోవాలని కొన్ని రైతు వేదికల్లో గ్రామాల్లో వ్యవసాయ శాఖ అవగాహన సదస్సులు నిర్వహించింది. అయితే యాసంగి సాగుపై మాత్రం అందుకు విరుద్ధంగా ప్రపోజల్స్‌‌ రెడీ చేసి సర్కారుకు పంపించింది. పోయినేడాది రబీలో ఎంత వరి సాగైందో ఈసారి కూడా అంతే సాగవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొంది. దీంతో సర్కార్​ కావాలనే వరి రైతులను అయోమయానికి గురిచేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి.. రాజకీయ లబ్ధి పొందాలనే రాష్ట్ర సర్కారు వరిపై డబుల్ గేమ్ ఆడుతోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. 


కేంద్రాన్ని బద్నాం చేసేందుకేనా !
ఈ వానకాలం సీజన్‌‌లో వడ్ల కొనుగోళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదని కేంద్రం ఎప్పుడో స్పష్టం చేసింది. అయితే నిల్వలు పేరుకుపోతున్నాయని, యాసంగి నుంచి రైతులతో ఫైన్​వెరైటీలు సాగు చేయిస్తే మంచి గిట్టుబాటు అవుతుందని అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. మొత్తం ఫైన్​వెరైటీలు సాగు చేయడం కష్టమని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా రైతులను రాష్ట్రాలు ప్రోత్సహించాలని కేంద్రం పేర్కొంది. దీనిని కారణంగా చూపిస్తూ.. కేంద్రం పారా బాయిల్డ్​ రైస్​ కొనబోమని చెప్పిందని, రైతులు వరి వేయద్దని సీఎం కేసీఆర్​ పిలుపునిచ్చారు. పూర్తిగా కేంద్రానిదే బాధ్యత అన్నట్లుగా ప్రకటన చేయడంపై ఇటు రైతులు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఏండ్లుగా సాగు చేస్తున్న వరి పంటను ఒక్కసారిగా వద్దనడం ఏంటి? ఒకవేళ కేంద్రం ఏమైనా రూల్స్‌‌ పెడితే రాష్ట్ర సర్కార్​ముందుకొచ్చి కొనుగోలు చేయాలనే రైతులు, రైతుల సంఘాలు డిమాండ్‌‌ చేశాయి. ఒకవైపు వరి వద్దంటూనే మీటింగులు పెట్టిన వ్యవసాయ శాఖ, సాగు విస్తీర్ణం ఏ మాత్రం తగ్గించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆర్డర్స్‌‌​ లేకుండానే పోయినసారి సాగైనంత విస్తీర్ణాన్ని వ్యవసాయ శాఖ ప్రపోజ్​చేస్తుందా? అనే చర్చ జరుగుతోంది.

 
అంతా గందరగోళం
వరి సాగుపై రాష్ట్ర సర్కార్​ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వస్తున్నయి.  మరో 20 రోజుల్లో వరినాట్లు మొదలవుతాయి. అయితే వ్యవసాయ శాఖ  ఏ సీడ్స్​ అందుబాటులో ఉంచుతుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. 5.01 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు చెప్తున్నా వివరాలను వెల్లడించలేదు. ఇందులో ప్రైవేట్ సెక్టార్‌‌‌‌లోనే 2.38 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు ఉన్నాయని తెలుస్తోంది.