వరి వేయడమంటే.. ఉరి వేసుకోవడమే

వరి వేయడమంటే.. ఉరి వేసుకోవడమే
  • రాష్ట్రంలో వరిసాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదు
  • ధాన్యం సేకరణ బాధ్యతను కేంద్రం పట్టించుకోవడం లేదు
  • ఈ వానాకాలంలో 60 లక్షల టన్నులకు మించి కొనలేం..
  • వ్యవసాయ శాఖ రివ్యూలో సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇకపై కిలో బాయిల్డ్‌ రైస్‌ కూడా కొనలేమని చెప్పిందని, ఇలాంటి పరిస్థితుల్లో వరి వేయడమంటే.. ఉరేసుకోవడమేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు మూతపడే ప్రమాదముందన్నారు. రాష్ట్ర రైతులు ఇకపై వరి సాగు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. సీఎం అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్​లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించే చర్యలు చేపడితే బాగుండేదని సీఎం అన్నారు. ఆహార నిల్వలను సాకుగా చూపి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, వానాకాలం సీజన్‌లో 60 లక్షల టన్నులకు మించి ధాన్యం తీసుకోబోమని వివరించిందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పడే పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు.

గత యాసంగిలో 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో వానాకాలంలో రైతులు 55 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారని, 1.40 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు రాష్ట్రంలోని రైస్‌‌ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో ఇప్పటికే 70 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఉందని చెప్పారు. కేంద్రం పెట్టిన కండీషన్లతో ధాన్యం కొనుగోలు కష్టమేనని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లతో రాష్ట్ర సర్కారుపై రూ.2 వేల కోట్ల భారం పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు యాసంగి సీజన్‌‌లో శనగలు, వేరు శనగలు, పెసలు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటి పంటలు పండిస్తే లాభసాటిగా ఉంటుందని చెప్పారు. ఈ వానాకాలంలో 60 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఐకేపీ ద్వారా కొనుగోలు చేసే అవకాశముందన్నారు.