చినుకు జాడేది .. ఉమ్మడి మెదక్ జిల్లాలో 26.6 శాతం లోటు వర్షపాతం

చినుకు జాడేది .. ఉమ్మడి మెదక్ జిల్లాలో 26.6 శాతం లోటు వర్షపాతం
  • మడుల్లో ముదిరిపోతున్న వరినారు
  • పత్తి రైతుల్లో మొదలైన ఆందోళన
  • వరుణుడి కరుణ కోసం అన్నదాత ఎదురుచూపు

ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు కొండేటి నగేశ్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామంలో తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుత సీజన్ లో వర్షాలు ప్రారంభం కాగానే రూ.10 వేలు ఖర్చు చేసి వరి నారు పోశాడు. జులై నెల సగం గడిచినా ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో నారు ముదిరిపోతోంది. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోతే నారు పనికి రాకుండా పోతుంది. ఇది ఒక్క నగేశ్ ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు ఉమ్మడి మెదక్ జిల్లాలో లక్షలాది మంది రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది. 

సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్  జిల్లాలో వరుణుడి కరుణ కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. వానాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా కనీస వర్షపాతం నమోదు కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  142.9  శాతం లోటు వర్షపాతం నమోదు కావడం కలవరపెడుతోంది. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో ప్రస్తుత సీజన్ లో 5.6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా జులై రెండో వారం గడిచినా 20 శాతం పంటలు కూడా సాగులోకి రాలేదు. వరి 3.6 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా వేస్తే ప్రస్తుతం 30 వేల ఎకరాలలోపే సాగవుతుంది. 1.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా వేయగా 60 వేల ఎకరాల్లో మాత్రమే గింజలు విత్తారు. మొక్కజొన్న 30 వేల ఎకరాల్లో అంచనా వేయగా 15 వేలు, కందులు 10 వేల ఎకరాల అంచనాల్లో 3 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. జిల్లాలో జులై రెండో వారం నాటికి 183.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 155.9 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతంలో 27.3 లోటు వర్షపాతం నమోదైంది.
 
మెదక్ జిల్లాలో..

జిల్లాలో జూన్ 1 నుంచి జులై 15 వరకు జిల్లా వ్యాప్తంగా సరాసరి 200.6 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 145.1 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. జిల్లా వ్యాప్తంగా సాధారణం కంటే 28 శాతం లోటు వర్ష పాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 21 మండలాలు ఉండగా కేవలం రామాయంపేట, నిజాంపేట, చేగుంట, కొల్చారం, తూప్రాన్ లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా 15 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్ష పాతం నమోదైంది. వానాకాలం సీజన్ లో అన్ని రకాల పంటలు కలిపి 3,50,164 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో అత్యధికంగా వరి 3,05,100 సాగవుతుందని అంచనా వేసినా ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

సంగారెడ్డి జిల్లాలో..

జిల్లాలో 191.1 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా జూన్ 15 నాటికి 131.2 మిల్లీమీటర్ల  వర్షపాతం మాత్రమే పడింది. 25 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తం 27 మండలాల్లో19 మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షం పడగా  కేవలం 8 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వ్యవసాయ అధికారులు  2,98,718.22 హెక్టార్లలో సాగు జరుగుతుందని అంచానా వేయగా ప్రస్తుతం అందులో పాతిక శాతం లోపే సాగులోకి వచ్చింది. ఓ పక్క వర్షాలు లేక మరోపక్క సింగూరు ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల కాక రైతులు అరిగోస 
పడుతున్నారు. 

వర్షాలు పడితేనే సాగు సాధ్యం

ఈ సీజన్ లో వానలు బాగా పడితేనే ఎవుసం చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా దుద్దెడ వాగుపై ఆధారపడి 3 ఎకరాల్లో వరి సాగు చేసేవాడిని. జులై రెండో వారం నాటికి వాగులోకి నీరు రాకపోవడంతో ప్రస్తుతం మూడెకరాలు పడావుగా ఉంది. వచ్చే పక్షం రోజుల్లో వర్షాలు కురిసి వాగులోకి నీరొస్తేనే సాగు సాధ్యమవుతోంది. 

రోసిలీ యాదయ్య,  రైతు, దుద్దెడ