మంగపేట, వెలుగు: ములుగు జిల్లాలోని ధాన్యం కొనుగోలు సెంటర్ లో నింపిన బస్తాలు వరుసగా మాయమవుతుండగా రైతుల్లో ఆందోళన నెలకొంది. మంగపేట మండలం బోర నర్సాపురం గ్రామానికి చెందిన రైతు తాండ్ర బక్కయ్య 40 వడ్ల బస్తాలు, మూతి రవికి చెందిన 21 వడ్ల బస్తాలు, చిట్టిపోతుల నర్స న్నకు చెందిన 11 వడ్ల బస్తాలను స్థానిక మాక్స్ సెంటర్ లో అమ్మకానికి తెచ్చారు.
శనివారం రాత్రి రైతు ల వడ్ల బస్తాలు చోరీ అయ్యాయి. అదేవిధంగా ఈనెల1న పయ్యావుల మహిన్ కు చెందిన 21 బస్తాల వడ్లు, ఎర్రసమయ్యగారి శ్రీనుకు చెందిన 21 ధాన్యం బస్తాలు కనిపించలేదు. దీంతో రైతులు దొంగలు ఎత్తుకెళ్లినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతు బక్కయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ టీవీఆర్ సూరి తెలిపారు.
అదే మండలంలోని కత్తిగూడెం చెందిన రైతు సాంబశివరావుకు చెందిన 6 వడ్ల బస్తాలు, రాజుపేటకు చెందిన మహబూబ్ సుభాన్ చెందిన10 ధాన్యం బస్తాలు రికవరీ చేశామని, రక్షణ బాధ్యత మాక్స్ సెంటర్ నిర్వాహకులదేనని, బాధ్యతగా ఉండి రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
