తిప్పలు పడుతున్న రైతులు

తిప్పలు పడుతున్న రైతులు
  • సాగు వివరాల రికార్డుకు తక్కువ టైమ్​​ ఇచ్చిన అగ్రికల్చర్​ శాఖ
  • ఫలితంగా పూర్తిస్థాయిలో నమోదు కాని డేటా

హైదరాబాద్‌‌, వెలుగు: పల్లెల్లో పంటల సాగు వివరాలను అధికారులు పూర్తి స్థాయిలో సేకరించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. పండిన వడ్లను తీసుకొని కొనుగోలు సెంటర్​కు పోతే.. ‘మీ పంట వివరాలు రికార్డుల్లో లేవు’ అని అక్కడి సిబ్బంది వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక ఆగమవుతున్నారు. అక్కడే వడ్ల కుప్పలతో పడిగాపులు కాస్తున్నారు. పంట వివరాల సేకరణకు వ్యవసాయశాఖ తక్కువ టైమ్‌‌ ఇవ్వడంతో చాలా గ్రామాల్లో పూర్తి వివరాలు రికార్డు కాలేదు. ఇవే వివరాలను అగ్రికల్చర్‌‌ అధికారులు పంట కొనుగోళ్ల కోసం ‘క్రాప్‌‌ బుకింగ్‌‌ డేటా’ కింద సివిల్‌‌ సప్లయ్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు షేర్‌‌ చేశారు. సెంటర్లలోని కంప్యూటర్లలో వచ్చే ఆ డేటా ప్రకారమే వడ్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. 

యాడ్‌ ల్యాండ్‌ ఆప్షన్​ ఎత్తేసిన్రు 

గతంలో పంట నమోదులో తప్పులు దొర్లినా, హెచ్చుతగ్గులు ఉన్నా.. గ్రామాల్లో ఉండే అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ల (ఏఈవోల)ను సంప్రదిస్తే సమస్య పరిష్కారమయ్యేది. ఏఈవో లాగిన్‌లో ‘యాడ్‌ ల్యాండ్‌’ ఆప్షన్‌  ఉండేది. దాంట్లో రైతుల వివరాలు తిరిగి నమోదు చేస్తే వడ్లు, ఇతర పంటలు అమ్ముకునే వెసులు బాటు ఉండేది. కానీ ఈసారి ‘యాడ్‌ ల్యాండ్’ ఆప్షన్‌ను డిసెబుల్‌ చేశారు.

పంట నమోదులో అన్నీ సమస్యలే

రాష్ట్రంలో క్రాప్‌బుకింగ్‌కు తక్కువ టైమ్‌ ఇచ్చి పంట వివరాలు నమోదు చేయడంతోనే సమస్యలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. క్లస్టర్లవారీగా ఒక్కో ఏఈవోకు 5 వేల ఎకరాల బాధ్యతలు అప్పగించారు. నెల రోజుల్లోగా గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా పంటనమోదు చేయాలని ఆదేశించారు. కానీ, 60 శాతం ఏఈవోల పరిధిలో 5 వేల ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంది. దీంతో  వ్యవసాయశాఖ ఇచ్చిన గడువు లోగా పూర్తిస్థాయిలో  పంట నమోదు కాలేదు. గ్రామాల్లో ఏఈవోలకు సహాయకులు లేకపోవడం కూడా సమస్యగా మారింది. ఏపీలో మాత్రం పంట వివరాల నమోదుకు మూడు నెలల టైమ్​ ఇచ్చారు. అక్కడ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉండడం, ప్రతి 1,000 ఎకరాలకు ఒక విలేజ్‌ అసిస్టెంట్‌ ఉండడంతో నమోదు వేగంగా జరిగింది.

వడ్లు ఎట్ల అమ్ముకోవాలె?

నేను రెండు ఎకరాల్లో వరి సాగు చేసిన. కోత తర్వాత ధాన్యం కొనుగోలు సెంటర్​లో పోసిన. వ్యవసాయ అధికారి ధ్రువీకరణ కావాలని అడిగితే ఆఫీసుకు పోయిన. అక్కడ నా సాగు వివరాలు ఆన్​లైన్​లో నమోదు కాలేదని అంటున్నరు. పంట వివరాల నమోదు గురించి నాకు తెలియదు. మా పంట కాడికి ఏ ఆఫీసర్​ రాలేదు. ఇప్పుడు నేను వడ్లు ఎట్లా అమ్ముకోవాలి?

- రాజయ్య, రైతు, సిద్దిపేట జిల్లా