రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం: వడ్ల సేకరణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రి రివ్యూ 

రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం: వడ్ల సేకరణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రి రివ్యూ 
  • మంత్రి జూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి కృష్ణారావు

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్/వనపర్తి, వెలుగు: వడ్ల సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్​కర్నూల్​లో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్​ హేమంత్​ కేశవ్​పాటిల్, వనపర్తిలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి వడ్లు, మక్కజొన్న కొనుగోళ్లపై రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీటింగ్​కు గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి  వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. వడ్ల సేకరణకు అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలని ఆదేశించారు. గోదాం, రైస్​ మిల్లు వద్ద వడ్లు ఎలా కట్​ చేస్తారని వనపర్తి సివిల్​ సప్లై ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖిల్లాగణపురం మండలం సోలీపూరు గోదాం వద్ద అన్​లోడింగ్​ సమయంలో క్వింటాకు 6 కిలోల వరకు కట్  చేస్తున్నారని టీఎస్​ ఉదయ్​ను ప్రశ్నించారు.

డీఎస్​వో చెప్పడంతోనే ఇలా చేస్తున్నానని చెప్పడంతో మంత్రి జోక్యం చేసుకొని డీఎస్​వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి వడ్లు లోడ్​ అయ్యాక తిరిగి చెకింగ్​ చేయడమేమిటని ప్రశ్నించారు. ఇలా కటింగ్​ చేసే వారిని సస్పెండ్​ చేయాలని కలెక్టర్​ను ఆదేశించారు.

ప్యాడీ క్లీనింగ్​ లేకుండా వడ్లు వస్తున్నాయని మిల్లర్ల​సంఘం నాయకుడు శేఖర్​రెడ్డి చెప్పగా, డీఆర్డీవో, డీసీవోలను మంత్రి ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో పర్యవేక్షణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి, కలెక్టర్​ ఆదర్శ్​ సురభి పాల్గొన్నారు.

బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ

కోడేరు: నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి వాగుపై రూ.6 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమిపూజ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కోడేరు, పెద్ద కొత్తపల్లి మండలాల ప్రజల ఇబ్బందులు తీరుతాయని చెప్పారు.

నాణ్యత విషయంలో రాజీ పడకుండా బ్రిడ్జి నిర్మించాలని ఆదేశించారు. కాంగ్రెస్  మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రావు, మాజీ సర్పంచ్  నక్క వేణుగోపాల్, మాషన్న పాల్గొన్నారు. అనంతరం ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈద్గా కాంపౌండ్​ వాల్​ పనులకు భూమిపూజ చేశారు.