వడ్ల సేకరణ స్పీడప్ .. మహబూబ్​నగర్​ జిల్లాలో పూర్తి కావొచ్చిన వడ్ల కొనుగోళ్లు

వడ్ల సేకరణ స్పీడప్ .. మహబూబ్​నగర్​ జిల్లాలో పూర్తి కావొచ్చిన వడ్ల కొనుగోళ్లు
  • నారాయణపేటలోనూ టార్గెట్​కు అదనంగా సేకరణ
  • వానాకాలం సాగు ప్రణాళికను ఖరారు చేసిన వ్యవసాయ శాఖ

మహబూబ్​నగర్​, వెలుగు : మూడేళ్ల తర్వాత మహబూబ్​నగర్​ జిల్లాలో యాసంగి సీజన్​లో వడ్ల సేకరణ స్పీడ్  అందుకుంది. రెండు సీజన్​లలో టార్గెట్​మేరకు సేకరణ జరగకపోగా..  రైతులు పండించిన పంటను కర్ణాటక వ్యాపారులు, స్థానికంగా ఉన్న బియ్యం వ్యాపారులకు పెద్ద మొత్తంలో అమ్ముకున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్లు.. ఈ సీజన్​లో వంద శాతం వడ్ల సేకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇన్​ టైంకు కొనుగోలు సెంటర్లను తెరవడంతో పాటు వచ్చిన వడ్లను వచ్చినట్లే కాంటా వేసి.. మిల్లులకు తరలించడంతో దాదాపు సేకరణ పూర్తి కావచ్చింది. ప్రస్తుతం జిల్లాలో కేవలం జడ్చర్ల నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వడ్ల సేకరణ జరుగుతుండగా.. మిగతా ప్రాంతాల్లో దాదాపు కొనుగోళ్లు పూర్తి కావచ్చాయి.

1.29 లక్షల మెట్రిక్​ టన్నుల కొనుగోళ్లు..

పాలమూరు జిల్లాలో ఈ యాసంగి సీజన్​లో రికార్డు స్థాయిలో వడ్ల కొనుగోలు జరిగాయి.  సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1.29 లక్షల మెట్రిక్​ టన్నుల వడ్లను సేకరించారు. మొత్తం 24,552 మంది రైతుల నుంచి ఈ వడ్లను సేకరించగా.. వీటి విలువ రూ.301 కోట్లుగా రిపోర్టులు చెబుతున్నాయి. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఇదే అత్యధికం 2022–-23  సీజన్​లో 21,879 మంది రైతుల నుంచి 1,12,770 మెట్రిక్​ టన్నుల వడ్లను సేకరించారు.

 వీటి విలువ రూ. 230.9 కోట్లు ఉంది. 2023–-24లో అత్యల్పంగా 5,345 మంది రైతుల నుంచి 26,893 మెట్రిక్​ టన్నుల వడ్లను మాత్రమే సేకరించారు. ప్రధానంగా ఈ సీజన్​లో ఎక్కువ మంది రైతులు ప్రైవేట్​ వ్యక్తులకు వడ్లను అమ్ముకున్నారు.  గత వానాకాలం సీజన్​ నుంచి రాష్ర్ట ప్రభుత్వం సన్నాల రకానికి క్వింటాలుకు రూ.500 బోనస్​ ప్రకటించడంతో అప్పటి నుంచి ప్రభుత్వ సెంటర్లకు వడ్ల పెద్ద మొత్తంలో వస్తున్నాయి. అయితే సీజన్​ ఇంకా ఉండటంతో మరో 50 వేల మెట్రిక్​ టన్నుల వరకు వడ్లు అవకాశం ఉన్నట్లు ఆ శాఖ పేర్కొంటోంది. 

మరో పది రోజుల పాటు సెంటర్లు ఓపెన్ 

నారాయణపేటలో ఈ యాసంగిలో 1.20 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. దాదాపు మూడు లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడులు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో సివిల్​ సప్లయ్​ ద్వారా లక్షన్నర మెట్రిక్​ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని టార్గెట్​గా పెట్టుకొని ఏప్రిల్​ రెండో వారం నుంచి జిల్లాలో వంద సెంటర్లను ఏర్పాటు చేసిన రైతుల నుంచి వడ్ల సేకరణను ప్రారంభించారు. దాదాపు 45 రోజుల్లోనే టార్గెట్​ పూర్తి చేశారు.

 1.50 లక్షల మెట్రిక్​ టన్నుల సేకరణకు గాను ఆ జిల్లా సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్​ ప్రకారం గురువారం నాటికి 24,481 మంది రైతుల నుంచి 1,74,173 మెట్రిక్​ టన్నుల వడ్లను సేకరించారు. ఇందులో ఇప్పటి వరకు 17,093 మంది రైతులకు 272.21 కోట్ల చెల్లింపులు పూర్తి చేశారు. ఆ డబ్బులను మొత్తం ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. మరో వారం నుంచి పది రోజుల పాటు సెంటర్లు తెరిచే ఉండే అవకాశం ఉండటంతో ఫైనల్​గా రెండు లక్షల మెట్రిక్​ టన్నుల వరకు కొనుగోలు జరిగే అవకాశం ఉందని ఆ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

3.46 లక్షల ఎకరాల్లో వానాకాలం సాగు ప్రణాళిక..

ఈ ఏడాది మహబూబ్​నగర్​ జిల్లాకు సంబంధించిన వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ రిలీజ్​ చేసింది. అన్ని రకాల పంటలు కలుపుకొని ఈ వానాకాలంలో 3,46,830 ఎకరాల్లో పంటలు సాగువుతాయని అంచనా వేసింది. ఇందులో ఎక్కువగా వరి పంటలే ఉన్నాయి. నిరుడు వానాకాలంలో వరి 1.94 లక్షల ఎరకరాల్లో సాగు కాగా.. ఈ సీజన్​లో మాత్రం దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేసింది.