భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎక్కువ వడ్లను ప్రైవేటోళ్లే కొన్నరు!

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఎక్కువ వడ్లను ప్రైవేటోళ్లే కొన్నరు!
  • 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు
  • ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 13,500 వేల మెట్రిక్ టన్నులే.. 
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,14,010 మెట్రిక్ టన్నుల వడ్లు దిగుబడి 
  • మద్దతు ధర కన్నా అధిక రేటు ఇస్తున్న వ్యాపారులు
  • ట్రాన్స్ పోర్టు కిరాయి, తరుగు, తేమశాతం లొల్లి లేకుండానే కొనుగోళ్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఈసారి వడ్లను ఎక్కువగా ప్రైవేట్​ వ్యాపారులే కొనుగోలు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,14,010 మెట్రిక్​ టన్నుల వడ్లు దిగుబడి వస్తే అందులో 90 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యం ప్రైవేట్​ వ్యాపారులు కొనుగోలు చేశారు. 13,500 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు కొన్నాయి. మద్దతు ధర  వ్యాపారులు అధికంగా చెల్లిస్తూ పంట పొలాల వద్దకే వెళ్లి రైతులతో కమిట్​మెంట్ 
చేసుకుంటున్నారు. 

కొర్రీలు లేవు.. స్పాట్​పేమెంట్​.. 

జిల్లాలో యాసంగి సీజన్​లో 61,017 ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. 1,41,010 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 136 కొనుగోలు కేంద్రాలను గవర్నమెంట్ తరఫున ఓపెన్ చేశారు. క్వింటాకు రూ. 2,203 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈసారి సన్న రకం వడ్లతో పాటు దొడ్డు రకం ధాన్యానికి మార్కెట్​లో డిమాండ్ ఉండడంతో రైతుల వద్దకు వ్యాపారులు క్యూ కట్టారు. మద్దతు ధర కన్నా కొంత మొత్తం అధికంగా ఇవ్వడంతో పాటు పొలాల వద్ద నుంచే ధాన్యం కొంటామంటూ వ్యాపారులు రైతులతో కమిట్ మెంట్ చేయించుకున్నారు.

 తేమ శాతం గొడవ లేదు. ట్రాన్స్ పోర్టు చార్జీలు లేవు, డబ్బులు స్పాట్​లో ఇస్తుండడంతో పాటు ప్రభుత్వ మద్దతు ధర కన్నా దాదాపు రూ. 100 నుంచి రూ. 500 వరకు అదనంగా వస్తుండడంతో రైతులు ప్రైవేట్ అమ్మకాలకే మొగ్గు చూపారు. ఇప్పటికే దాదాపు 90వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని వ్యాపారులకు అమ్మేశారు.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 13,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు.