నయీమ్ ఆస్తులు, డ్రగ్స్ కేసులెక్కడికి పోయాయి : పద్మనాభ రెడ్డి

నయీమ్ ఆస్తులు, డ్రగ్స్ కేసులెక్కడికి పోయాయి : పద్మనాభ రెడ్డి

రాష్ట్రంలో సంచలనం సృష్టించి… సిట్ దర్యాప్తు తర్వాత చల్లారిపోయిన నయీమ్ ఎన్ కౌంటర్, డ్రగ్స్ కేసు దర్యాప్తు వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభ రెడ్డి. మూడేళ్ళ కిందట నయీమ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారనీ… ఆ తర్వాత అనేక సంచలన అంశాలు బయటకొచ్చాయన్నారు. సిట్ దర్యాప్తులో తేలాల్సిన… నయీమ్ -పోలీసులు – రాజకీయ నేతలు సంబంధాలు మాత్రం బయటకు రాలేదన్నారు. రెండు కౌంటింగ్ మెషీన్లను తీసుకొచ్చి డబ్బులు లెక్కించామని అధికారులు చెప్పారని.. కానీ సిట్ దర్యాప్తు నివేదికలో రూ.3 లక్షల 74 వేలే దొరికాయని తేలిందన్నారు. ఆ డబ్బు లెక్కించడానికి కౌంటింగ్ మెషీన్లు అవసరమా అని ప్రశ్నించారు పద్మనాభరెడ్డి.

నయీమ్ తో రాజకీయ నాయకులకు సంబంధముందని ఆర్టీఐలో తేలిందని.. వారిపై చర్యలు ఏం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పద్మనాభరెడ్డి. నయీమ్ ఇంట్లో దొరికిన డైరీలో ఏముందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2003 నుంచి నయీమ్ అరాచకాలపై 8 పెండింగ్ కేసులుండేవనీ.. అవి అతడు చనిపోయిన తర్వాత ఎందుకు రీ ఓపెన్ చేశారని ప్రశ్నించారు. నయీమ్ సొంతమైన భూముల లెక్కలు చెప్పాలన్నారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో కూడా ఆర్టీఐ ద్వారా సమాచారం రాబట్టామన్నారు పద్మనాభరెడ్డి. డ్రగ్స్ కేసులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయనీ.. చార్జిషీట్ లో మాత్రం వారి పేర్లు లేవని గుర్తుచేసిన పద్మనాభరెడ్డి.. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతో డ్రగ్స్ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం బయటపడిందన్నారు. డ్రగ్స్ కేసును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించిందన్నారు.