
లాహోర్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇతర దేశాధినేతలు అందజేసిన బహుమతులను ఇమ్రాన్ అమ్ముకున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించడం సంచలనం రేపుతోంది. ఒక గల్ఫ్ దేశ యువరాజు ఇచ్చిన అత్యంత ఖరీదైన గడియారాన్ని విక్రయించడం ద్వారా సుమారు రూ.7.4 కోట్లను ఇమ్రాన్ తన జేబులో వేసుకున్నారని విపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన గిఫ్ట్‌లను ఇమ్రాన్ అక్రమంగా అమ్మారని పీఎంఎల్‌ఎన్ వైస్ ప్రెసిడెంట్ మరియం నవాజ్ ఆరోపించారు. ఇమ్రాన్ తీరు సిగ్గుచేటని పాకిస్థాన్ డెమొక్రటిక్ మూమెంట్ (పీడీఎం) ప్రెసిడెంట్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ విమర్శించారు. కాగా, ఇతర దేశాల నుంచి వచ్చిన బహుమతులను తోష్‌ఖానా రూల్స్ ప్రకారం వేలంలో విక్రయించాలి. అప్పటిదాకా వాటిని ఆ దేశ ఆస్తులుగా భావించి భద్రపరుస్తారు. వేలంలో ఎవరైతే గెలుచుకుంటారో వారికి ఆ బహుమతులను అప్పగిస్తారు.