
పాత వీడియోను మార్ఫ్ చేసి అభినందన్‌కు లింక్ చేసిన పాక్
పాకిస్థాన్ మరోసారి వక్రబుద్ధి చూపించింది. అప్పుడెప్పుడో జరిగిన వీడియోను పోస్ట్ చేసి అభినందన్ వర్తమాన్‌కు లింక్ చేసింది. రిటైర్డ్ ఐఏఎఫ్ ఎయిర్ మార్షల్, యుద్ధ హీరో వీడియోను ఎడిట్ చేసి తప్పుడు వ్యాఖ్యానాలు చేసింది. కానీ, మనోళ్లు ఊరుకుంటారా పాక్‌కు వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. ఇంతకీ ఏమైంది..? మాజీ ఎయిర్ మార్షల్ డెంజిల్ కీలర్ వీడియోను పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. ఐఏఎఫ్, పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ మధ్య ఫిబ్రవరి 27న జరిగిన డాగ్‌ఫైట్‌లో ఇండియా ఫెయిలై, చాలా కోల్పోయిందని ఇండియా మాజీ ఎయిర్ మార్షల్ ఒప్పుకున్నారంటూ ట్వీట్ చేశారు.
అయితే, ఆ వీడియో ఇప్పటిది కాదని పాపం గఫూర్‌కు తెలిసుండదు. దీంతో వెంటనే నెటిజన్లు ఆ విషయాన్ని బయటపెట్టి పాక్‌ను ఓ ఆట ఆడుకున్నారు. బాలాకోట్ స్ట్రైక్స్‌కు నాలుగేళ్ల ముందు అంటే 2015లో ఆ వీడియో తీశారని గుర్తు చేశారు.1962, 1965 యుద్ధంపై ‘నెహ్రూ లాస్ట్ ఇండియా ద వార్’ పేరిట డెంజిల్ కీలర్ను చేసిన ఇంటర్వ్యూ వీడియో అదని, 2015 ఆగస్టు 9న వైల్డర్నెస్ ఫిల్మ్స్ ఇడియా ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిందని కౌంటర్ ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూకు వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ వీడియోను అటాచ్ చేసి పాక్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడుతున్నారు.