
- రేర్ ఎర్త్ మినరల్స్ గురించి వివరించగా.. ఆసక్తిగా విన్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ఇటీవల వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలను వాళ్లు ట్రంప్కు చూపించారు. ఓ చెక్క పెట్టెలో ఖనిజాలు ఉండగా.. వాటి గురించి మునీర్ వివరిస్తున్నారు. ట్రంప్, షెహబాజ్ షరీఫ్ ఇద్దరూ.. ఆసక్తిగా వింటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆదివారం వైట్ హౌస్ రిలీజ్ చేసింది. ఈ భేటీలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఉన్నారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. కాగా, రేర్ ఎర్త్ మినరల్స్‌లో చైనా ఆధిపత్యానికి గండికొట్టాలని ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. దీంతో తాజాగా పాకిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉందని ట్రంప్కు మునీర్ వివరించారు. ఫలితంగా వాటి వెలికితీతపై అమెరికా ఆసక్తి కనబరుస్తున్నది. పాకిస్తాన్లో పాలీ మెటాలిక్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్‌తో అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ మెటల్స్ సంస్థ ఎంవోయూపై సంతకాలు చేశాయి. దీనిలో భాగంగానే అమెరికాకు చెందిన ఓ కంపెనీ 500 మిలియన్ డాలర్లు పాక్‌లో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్లు సమాచారం.
పోర్చుగల్ గ్రీస్ కంపెనీతో సెకండ్ డీల్
నేషనల్ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్, పోర్చుగల్గ్రీస్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన మోటా – ఎంగిల్ గ్రూప్ మధ్య రెండో అగ్రిమెంట్ కుదిరింది. పాకిస్తాన్ భూమి లోపలి నుంచి కాపర్, గోల్డ్, అరుదైన ఖనిజాలతో పాటు ఇతర మినరల్స్ వెలికి తీసేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు పోర్చుగల్ ప్రతినిధులు ప్రకటించారు. పాకిస్తాన్లో అపారమైన ఖనిజ సంపద ఉందని, వీటి విలువ కొన్ని ట్రిలియన్ డాలర్లు ఉంటుందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ప్రకటించారు. దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు, రుణాల నుంచి విముక్తి పొందేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకమని తెలిపారు. తమ వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉందని, దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోనున్నదని ఆర్మీ చీఫ్ మునీర్ చెప్పారు. అతి త్వరలోనే పాకిస్తాన్
సుసంపన్న దేశంగా మారుతుందని తెలిపారు.