సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాక్ ఆల్‌రౌండర్

సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాక్ ఆల్‌రౌండర్

పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసిమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే ప్రపంచకప్ 2023 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఇమాద్.. త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక కాలేదు. సహచర ఆటగాళ్లతో విబేధాల కారణంగా మున్ముందు ఆ అవకాశాలు లేకపోవడంతో ఆటకు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు.

పాకిస్తాన్ తరపున 55 వన్డేలు, 66 టీ20లు ఆడిన ఇమాద్ వసిమ్.. చివరిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఆడాడు. ఈ 121 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్న ఇమాద్.. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

'గత కొద్ది రోజులుగా నా ఇంటర్నేషనల్ కెరీర్ గురించి సుదీర్ఘంగా ఆలోచించాను. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని నిర్ణయానికి వచ్చా. పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. వన్డేలు, టీ20ల్లో కలిపి పాకిస్థాన్ తరఫున 121 మ్యాచ్‌ల్లో ఆడటంతో నా  కల నిజమైంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు.."

"పాకిస్థాన్ క్రికెట్‌కు ఇది ఉత్తేజకరమైన సమయం. కొత్త కోచ్, కొత్త కెప్టెన్ల నాయకత్వంలో పాకిస్థాన్ జట్టు అద్భుతాలు సృష్టిస్తుందని భావిస్తున్నాను. అసాధారణ విజయాలు అందుకోవడం నేను చూడాలని కోరుకుంటున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ అభిమానులకు ధన్యవాదాలు. నేను ఈ స్థితికి చేరుకోవడంలో నాకు సహాయం చేసిన నా కుటుంబం మరియు స్నేహితులకు చివరిగా ధన్యవాదాలు. మున్ముందు నేను అంతర్జాతీయ స్థాయికి దూరంగా నా క్రీడా జీవితంలో తదుపరి దశపై దృష్టి సారించాలని ఎదురుచూస్తున్నాను.." అని ఇమాద్ ట్విట్టర్(ఎక్స్)లో భావోద్వేగ ప్రకటన చేశాడు. 

34 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ 55 వన్డేలలో 44 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 42.87 సగటుతో 986 పరుగులు చేశాడు. ఇక 66 టీ20ల్లో 65 వికెట్లు పడగొట్టి 486 పరుగులు చేశాడు. 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న పాకిస్థాన్ జట్టులో ఇమాద్ సభ్యుడు.  భారత్‌తో జరిగిన ఫైనల్‌లో అతడు 21 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అలాగే, 2019 వన్డే ప్రపంచ కప్‌, 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.