
న్యూఢిల్లీ: తమ దేశానికి నీళ్లు వదలాలంటూ పాకిస్తాన్ మన దేశాన్ని వేడుకుంది. సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరింది. నీళ్లు రాక పాక్‌లోని సింధ్ ప్రాంతంలో కరువు ఏర్పడిందంటూ కాళ్ల బేరానికి వచ్చింది. ఈమేరకు బుధవారం సాయంత్రం ఇండియాకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా అధికారికంగా లేఖ రాశారు.
సింధూ జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై పున:పరిశీలించాలని లేఖలో కోరారు. ప్రజలు కష్టాలు ఎదుర్కుంటున్నారని, ఎడారిగా మారుతున్న సింధ్ ప్రాంతంపై దయ చూపాలని వేడుకున్నారు. ఈ సున్నితమైన అంశంపై చర్చలకు సిద్ధమని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను మన దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది.
చుక్క నీరు ఇచ్చేదిలేదు..
పహల్గాం టెర్రరిస్ట్‌ల దాడి జరిగిన మరుసటి రోజే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏం జరిగినా చుక్క నీరు ఇచ్చేదిలేదని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ అదే వైఖరిని కొనసాగిస్తోంది. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదివరకే తేల్చి చెప్పారు. పాకిస్తాన్‌తో చర్చలంటూ ఉంటే అవి కేవలం టెర్రరిజాన్ని అంతం చేయడం, పీవోకే గురించి మాత్రమేనని స్పష్టం చేశారు.
అప్పుడు ప్రగల్భాలు.. ఇప్పుడు కాళ్ల బేరం..
తొలుత ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. చట్టవిరుద్ధమని వాదిస్తూ, టెర్రరిస్టులకు మద్దతిచ్చింది. సింధు జలాలను ఆపడం అంటే తమ దేశంపై యుద్ధం ప్రకటించమేనంది. నీళ్లను అడ్డుకునేందుకు చేపట్టే నిర్మాణాలను పేల్చివేస్తామంటూ ప్రగల్భాలు పలికింది. ఇప్పుడు మనదేశం నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో పాక్‌లోని అనేక ప్రాంతాల్లో సంక్షోభం మొదలైంది. సింధ్, బార్డర్ ప్రాంతాల్లోని స్థానికులు నీటి అవసరాలకోసం ఇబ్బంది పడుతున్నారు. ఇంకొద్దిరోజులైతే సింధ్ ప్రాంతం మొత్తం పూర్తిస్థాయి కరువును ఎదుర్కోవాల్సివస్తుంది. దీంతో చేసేదేంలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది.
పస్రూర్ కంటోన్మెంట్‌కు పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్
లాహోర్: సియోల్‌కోట్ పస్రూర్ కంటోన్మెంట్‌ను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సందర్శించా రు. బుధవారం అక్కడికి చేరుకున్న షరీఫ్.. ఇటీవల భారత్‌తో జరిగిన సైనిక సంఘర్షణలో పాల్గొన్న అధికారులు, సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సమయంలో ధైర్యం, సాహసాన్ని ప్రదర్శించారని మెచ్చుకున్నారు. సైన్యానికి ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్దూ ఉన్నారు. కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ సైన్యం సియోల్‌కోట్, పస్రూర్ ఏవియేషన్ బేస్‌లోని రాడార్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర నష్టాన్ని కలిగించింది.