ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు జరిపి 28 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని పాకిస్తాన్ వెల్లడించింది. ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌లో కచ్చితమైన నిఘా సమాచారంతో ‘ఫిత్నా అల్-ఖవారీజ్’ (తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ - టీటీపీ), దాని అనుబంధ సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు తెలిపింది.
ఆత్మాహుతి బాంబర్ల శిక్షణ కేంద్రంతో సహా 3 కీలక లక్ష్యాలను (కునార్, పక్తికా, ఖోస్త్ ప్రావిన్సు) ధ్వంసం చేసినట్లు పేర్కొంది. కాగా, ఖైబర్ పఖ్తూంఖ్వాలోని కోహట్ పోలీస్ ఫెసిలిటీపై గత వారం జరిగిన ఉగ్రదాడిలో 15 మంది పోలీసులతో సహా 21 మంది మృతి చెందారు. అలాగే ఆదివారం హంగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు అధికారులతో సహా ఆరుగురు పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి.
ప్రతీకారం తీర్చుకుంటం: తాలిబన్
కునార్, పక్తికా ప్రాంతాలపై పాకిస్తాన్ జరిపిన దాడుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు. దాడుల్లో మరో నలుగురు గాయపడ్డారని, పలు నివాసాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ దురాక్రమణకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక, ఉగ్రవాదులు అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకుని తమపై దాడి చేస్తున్నారని పాక్ ఆరోపిస్తుండగా.. తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని తాలిబాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
