పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో గూఢచర్యం..!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో గూఢచర్యం..!

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ హత్యకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణలతో ఆయన ఇంట్లోని సిబ్బందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఇమ్రాన్ నివాసంలో పనిచేసే బని గాలా అనే ఉద్యోగి.. ఆయన బెడ్ రూంను శుభ్రపరచడానికొచ్చి.. ఓ నిఘా పరికరాన్ని అమర్చేందుకు ప్రయత్నించాడని.. అక్కడే పనిచేసే మరో సిబ్బంది చెప్పడంతో విషయం బయటకొచ్చింది. దీంతో మాజీ ప్రధానిపై గూఢచర్య ప్రయత్నం జరిగి, విఫలమైనట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇస్లామాబాద్ కు చెందిన బని గాలాను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది.. ఫెడరల్ పోలీసులకు అప్పగించారు.

ఇమ్రాన్ ఖాన్ పై హత్యకు కుట్ర జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్న ఈ సమయంలోనే... ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇస్లామాబాద్, ఇమ్రాన్ నివాస ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అతని ప్రాణాలకు ముప్పుందని పీటీఐకి చెందిన కొందరు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వంతో సహా అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ నాయకుడు షాబాజ్ గిల్ తెలిపారు. ఇమ్రాన్ ఇంట్లో గదిని శుభ్రపర్చే సిబ్బందికి డబ్బులిచ్చి.. నిఘా పరికరాలు అమర్చాలని పురమాయించినట్టు చెప్పుకొచ్చారు. ఇది చాలా హీనమైన, దురదృష్టమైన చర్యగా అభివర్ణించిన ఆయన.. ఇలాంటి సిగ్గు మాలిన చర్యలు మానుకోవాలని సూచించారు.