పాపం బాబర్ చాలా మంచోడు.. పాక్ మాజీ కెప్టెన్‌పై ఇయాన్ చాపెల్ సానుభూతి

పాపం బాబర్ చాలా మంచోడు.. పాక్ మాజీ కెప్టెన్‌పై ఇయాన్ చాపెల్ సానుభూతి

భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 బాబర్ అజామ్ కెప్టెన్సీకి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో భారత గడ్డపై అడుగుపెట్టిన దాయాది పాకిస్తాన్ జట్టు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. లీగ్ దశలో తొమ్మిదింటిలో ఐదింట ఓడి సెమీస్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. పైగా అఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ ఓటముల నేపథ్యంలో తీవ్ర విమర్శలు రావడంతో బాబర్ అజామ్ కెప్టెన్సీకి స్వస్తి పలికాడు.      

బాబర్ కెప్టెన్సీని వదులుకున్న గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త సారథులను ప్రకటించింది. షాహీన్ ఆఫ్రిదిని టీ20 కెప్టెన్‌గా, షాన్ మసూద్‌ను టెస్ట్‌ సారథిగా నియమించింది. తాజాగా, ఈ కెప్టెన్సీ మార్పుపై ఆసీస్ మాజీ దిగ్గజం ఇయాన్ చాపెల్ స్పందించారు.

కెప్టెన్లను మార్చడమనేది పాకిస్తాన్‌కు ఉన్న విలక్షణమని చెప్పిన చాపెల్.. బాబర్ చాలా మంచి ఆటగాడు అంటూ అతనిపై సానుభూతి వ్యక్తం చేశారు. "పాపం, బాబర్ చాలా మంచి ఆటగాడు అని అనుకుంటున్నా. కెప్టెన్సీ పోయినంత మాత్రాన అతను పాకిస్తాన్ జట్టును వదలడు. తరచుగా కెప్టెన్‌లను మార్చడమనేది పాకిస్థాన్‌కు ఉన్న ఒక విలక్షణం.. వారు మారుస్తూనే ఉంటారు.." అని వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్ అవుట్‌సైడ్ ది రోప్‌లో మాట్లాడుతూ చాపెల్ వ్యాఖ్యానించారు.

కాగా, షాన్ మసూద్‌ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు త్వరలోనే ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.