26/11 ముంబై అటాక్ మాస్టర్ మైండ్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష

26/11 ముంబై అటాక్ మాస్టర్ మైండ్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష

26/11 ముంబై అటాక్ మాస్టర్ మైండ్, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడన్న ఆరోపణలపై పాకిస్థాన్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు (ఏటీసీ) ఈ తీర్పు ఇచ్చింది. హఫీజ్ సయీద్ సహా మరికొందరిపై ఉన్న టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో గతేడాది డిసెంబరు 11 నుంచి ఏటీసీ రోజువారీ విచారణ చేపడుతోంది. రెండు కేసులకు సంబంధించి సుదీర్ఘ విచారణ తర్వాత బుధవారం సయీద్‌ను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. ఒక్కోదానికి ఐదున్నరేళ్ల చొప్పును మొత్తం 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అలాగే 30 వేల జరిమానా కూడా విధించింది.

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో నమోదైన రెండు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసుల్లో బుధవారం ఈ తీర్పు వచ్చింది. అయితే హఫీజ్‌ సయీద్‌పై మొత్తం ఆరు టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులు నమోదై ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి విచారించాలని అతడు తాజాగా పిటిషన్ వేశాడు.

బ్లాక్ లిస్టులోకి వెళ్లకుండా కంటితుడుపు చర్యలేనా?

టెర్రరిస్ట్ సంస్థలకు ఆర్థిక సహాయం అందకుండా కంట్రోల్ చేసే అంతర్జాతీయ సంస్థ ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గత ఏడాది అక్టోబర్‌లో పాకిస్థాన్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులకు మనీలాండరింగ్, ఇతర రూపాల్లో డబ్బు అందుతోందని, దాన్ని కంట్రోల్ చేయకుంటే పాక్‌ను బ్లాక్‌ లిస్టులో పెడతామని వార్నింగ్ ఇచ్చింది. అప్పటికే గ్రే లిస్టులో ఉన్న ఆ దేశానికి అంతర్జాతీయంగా ఎటువంటి ఆర్థిక సహాయం అందకుండా పోయింది. ఇక బ్లాక్ లిస్టులో పడితే మిత్ర దేశాలుగా ఉన్న చైనా, మలేసియా, టర్కీల నుంచి సైతం ఎటువంటి సాయం రాకుండా FATF ఆంక్షలు పెడుతుంది. 2020 ఫిబ్రవరి 16న పారిస్‌లో జరిగే FATF ప్లీనరీ సమావేశంలోపు తాము సూచించిన 27 అంశాల్లో నియంత్రణ తెస్తే తప్ప పాకిస్థాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని 2019 అక్టోబర్‌లో వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆంక్షల భయంతో పాక్ సర్కారు తన మిత్రులైన ఉగ్ర సంస్థల చీఫ్‌లపై చర్యల కలరింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. 2008లో ముంబై నగరంపై ఉగ్రమూక సృష్టించిన నరమేధం వెనుక మాస్టర్ మైండ్ హఫీజ్ సయీదేనని భారత ప్రభుత్వం అనేక మార్లు సాక్ష్యాలు సమర్పించినా స్పందించని పాకిస్థాన్ ఇప్పుడు అతడికి జైలు శిక్ష విధించడం కంటితుడుపు చర్యలానే ఉంది.

మరోవైపు గత నెలలో జరిగిన FATF మీటింగ్‌లోనూ చైనా సహా మరికొన్ని దేశాలు పాక్‌ను వెనకేసుకొచ్చాయి. ఉగ్రవాదంపై ఇమ్రాన్ సర్కారు గట్టిగా వ్యవహరిస్తోందని, ఆ దేశాన్ని గ్రే లిస్టు నుంచి కూడా మినహాయించాలని కోరాయి. మరో నాలుగు రోజుల్లో ప్లీనరీ జరగబోతున్న సమయంలో పాక్ కోర్టు తీర్పు ఎటువంటి ప్రభావం చూపబోతోందో చూడాలి.