పాత ఫొటోలతో పాక్ ఫేక్ ప్రచారం

పాత ఫొటోలతో పాక్ ఫేక్ ప్రచారం

 న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం మొదలుపెట్టింది. పాత ఫొటోలు, ఫేక్ వార్తలతో సోషల్ మీడియాలో అలజడి సృష్టించే ప్రయత్నం చేసింది. భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ వైమానిక దళం కూల్చివేసినట్లు, శ్రీనగర్ ఎయిర్‌‌బేస్‌‌పై పాక్ ఆర్మీ దాడి చేసినట్లు, భారత బ్రిగేడ్ హెడ్‌‌క్వార్టర్స్‌‌ను ధ్వంసం చేసినట్లు, భారత్ లోని 15  కీలకమైన స్థానాలపై దాడులు చేసినట్లు ఎక్స్ తో సహా అన్ని సోషల్ మీడియాల్లో ఫేక్ న్యూ్స్ వ్యాప్తి చేసింది.  అంతేగాక..భారత్ చేసిన దాడుల్లో 26 మంది పాక్ పౌరులు మరణించారని బద్నాం చేసే ప్రయత్నం కూడా మొదలు పెట్టింది. అయితే, పాక్ వ్యాప్తి చేసిన ఫేక్ న్యూస్ కు భారత్ అంతేగట్టిగా కౌంటర్ ఇచ్చింది.

 ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్-చెక్ విభాగం పాక్ చేసిన ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది. “పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్స్ పాత వీడియోలను, ఫొటోలను వ్యాప్తి చేస్తున్నాయి. భారత ప్రభుత్వ అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే ప్రజలునమ్మాలి” అని పీఐబీ సూచించింది. 2024 సెప్టెంబర్‌‌లో రాజస్థాన్‌‌లోని బార్మెర్‌‌లో జరిగిన భారత ఎంఐజీ-29 క్రాష్‌‌, 2024లో ఖైబర్ పఖ్తూన్‌‌ఖ్వాలో జరిగిన మతపరమైన ఘర్షణలకు సంబంధించిన పాత ఫొటోలను, పాత వీడియోలను పాకిస్తాన్ ఫేక్ న్యూస్ లకు ఉపయోగించిందని తెలిపింది. భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడులు జరిపిందని..సైనిక లేదా పౌర లక్ష్యాలను ఎంచుకోలేదని పీఐబీ స్పష్టం చేసింది.