టీ20 వరల్డ్ కప్ విన్నర్ పాకిస్తానే..ఎందుకంటే..?

టీ20 వరల్డ్ కప్ విన్నర్ పాకిస్తానే..ఎందుకంటే..?

పాకిస్తాన్ ..ఈ జట్టు ఆట తక్కువ. అదృష్టం ఎక్కువ. ఎంతలా అంటే..ఓ దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే స్థాయికి దిగజారింది. అయితే అనూహ్యంగా సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలవడంతోపాటు..చివరి మ్యాచులో బంగ్లాదేశ్పై ఉత్కంఠ పోరులో గెలిచి...సెమీస్కు చేరుకుని ఊపిరి పీల్చుకుంది. ఇక సెమీస్లో పాక్ అసలైన ఆటతీరును కనభర్చింది. పటిష్ట న్యూజిలాండ్పై ఝూళువిదల్చింది. ఏకపక్షంగా మ్యాచును సొంతం చేసుకుని ఏకంగా ఫైనల్ చేరింది. ఇప్పుడు మరో టఫ్ టీమ్  ఇంగ్లాండ్తో టైటిల్ కోసం పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో ఆటతో పాటు..అదృష్టం కలగలిసిన పాకిస్తానే టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంటుందని క్రికెట్ నిపుణులు, ఆ జట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు. దీనికి సరైన ఆధారాలున్నాయని చెప్తున్నారు. 1992 వరల్డ్ కప్ను ఆధారంగా చూపిస్తున్నారు. 

1992 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఏం చేసింది..?
రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన 1992 వరల్డ్ కప్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 9 జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో పాక్ ఓడిపోయింది. వెస్టిండీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. ఆ తర్వాత మ్యాచులో జింబాబ్వే పై 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ రద్దయింది. అనంతరం టీమిండియా చేతిలో మరో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై వరుస విజయాలతో సెమీస్కు దూసుకెళ్లింది. సెమీస్లో  న్యూజిలాండ్ ను మట్టికరిపించి ఫైనల్కు వెళ్లింది. ఇక ఫైనల్లో ఇంగ్లాండ్పై గెలిచి వరల్డ్ కప్ను ముద్దాడింది. 

టీ20 వరల్డ్ కప్ 2022 పాక్ ఆట తీరు..
ఈ వరల్డ్ కప్లో గ్రూప్ 2 నుంచి బరిలోకి దిగిన పాక్..తొలి మ్యాచ్లో ఇండియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత రెండో మ్యాచ్లో జింబాబ్వే చేతిలో ఓటమిపాలైంది. అనంతరం  నెదర్లాండ్స్,  సౌతాఫ్రికాపై వరుస విజయాలు సాధించింది. చివరి మ్యాచులో బంగ్లాదేశ్పై గెలిచింది. అయితే అప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించే దశలో ఉన్న పాకిస్తాన్..అదృష్టంతో సెమీస్ చేరింది. సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ గెలవడంతో...పాక్ సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ సెమీస్లో పటిష్ట న్యూజిలాండ్ను ఓడించి ఫైనల్కు దూసుకొచ్చింది. 

1992 వరల్డ్ కప్..2022 టీ20 వరల్డ్ కప్కు పోలికలు...
ఈ రెండు వరల్డ్ కప్లు ఆస్ట్రేలియాలో జరగడం మొదటి విశేషం. ఆ తర్వాత పాకిస్తాన్ ఆ టోర్నీలో మొదటి మ్యాచ్ మెల్బోర్న్ లోనే జరిగింది. అందులో ఓడిపోయింది. ఈ టోర్నీలోని మొదటి మ్యాచ్ను పాక్ మెల్బోర్న్ లో ఆడింది. ఇండియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్లో  వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచింది. 2022 టీ20 వరల్డ్ కప్లోనూ పాక్ వరుసగా మూడింటిలో విజయం సాధించింది. 1992 వరల్డ్ కప్లో చివరి రోజు ఒక్క పాయింట్ తేడాతో సెమీస్కు క్వాలిఫై అయింది. ఈ వరల్డ్ కప్లో కూడా చివరి రోజు  ఒక పాయింట్తో అనూహ్యంగా సెమీస్కు చేరుకుంది. 1992 వరల్డ్ కప్లో పాక్ న్యూజిలాండ్తో సెమీస్ ఆడింది. ఈ వరల్డ్ కప్లోనూ సెమీస్లో పాక్ న్యూజిలాండ్తోనే సెమీస్ ఆడటం విశేషం.  1992 ఫైనల్లో పాకిస్తాన్  ఇంగ్లాండ్ను ఢీకొట్టింది. ఈ వరల్డ్ కప్లోనూ పాకి..ఫైనల్లో ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. అప్పుడు..ఇప్పుడు ఫైనల్ మ్యాచులకు మెల్ బోర్న్ స్టేడియమే వేదిక అవుతుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకులు, పాక్ అభిమానులు పాకిస్తానే విజేతగా అవతరిస్తుందని బలంగా నమ్ముతున్నారు. 


ఆటతో పాటు అదృష్టం కలిసి వస్తేనే..
1992 వరల్డ్ కప్ విజేత అయిన పాకిస్తాన్ మరోసారి విశ్వవిజేతగా అవతరించాలంటే..సర్వ శక్తులు ఒడ్డాల్సిందే. అయితే రెండు వరల్డ్ కప్లకు దగ్గరి పోలికలు ఉన్నా...పాకిస్తాన్ మాత్రం ఇంగ్లాండ్ను ఓడించడం అంతతేలిక కాదు. క్రికెట్ విశ్లేషకులు, పాక్ అభిమానులు విశ్వసిస్తున్నట్లు..పాకిస్తానే విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి.