పాకిస్తాన్ లో ఎన్నికల పోలింగ్.. ఇంటర్నెట్ బంద్..

పాకిస్తాన్ లో ఎన్నికల పోలింగ్.. ఇంటర్నెట్ బంద్..

పాకిస్తాన్ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయ్యింది. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 6 లక్షల 50 వేల మంది సెక్యూరిటీ సిబ్బంది పోలింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ కు ఒక్క రోజు ముందు.. అంటే ఫిబ్రవరి 7వ తేదీ దేశంలో రెండు చోట్ల జరిగిన బాంబు దాడుల్లో 20 మంది చనిపోయారు. 

పోలింగ్ హింసాత్మకంగా మారకుండా.. ఓటర్లను ప్రభావితం చేయకుండా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజల దగ్గరకు చేరకుండా ఉండేందుకు.. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికారులు. ఇంటర్నెట్ ఆధారిత అన్ని సేవలను బంద్ చేశారు. దీంతో పాకిస్తాన్ దేశంలో పోలింగ్ ఎలా జరుగుతుంది.. ఏ విధంగా జరుగుతుంది అనేది మిగతా ప్రాంతాలకు తెలియటం లేదు. 

అత్యవసర విభాగాలు, పోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు, భద్రతా బలగాలకు మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. హింసాత్మక ప్రాంతాల్లో మొబైల్ సేవలను సైతం నిలిపివేశారు. పాకిస్తాన్ లో జరిగే పోలింగ్ విజువల్స్, ఫొటోలను భద్రతా సిబ్బంది, పోలింగ్ అధికారులు మాత్రమే విడుదల చేస్తున్నారు. కొన్ని నెట్ వర్క్ లను పూర్తిగా నిలిపివేశారు. మరికొన్ని నెట్ వర్క్ సేవలను పాక్షికంగా నిలిపివేసినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. 

పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. దేశ రాజధాని లాహోర్ లో వందల మంది పోలింగ్ బూతుల దగ్గర క్యూలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఓటింగ్ ఉత్సాహంగా సాగుతున్నట్లు స్పష్టం చేశాయి ఆ దేశ మీడియా. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అడియాల జైలులో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి సుప్రీంకోర్టు. ఇమ్రాన్ తోపాటు అతని భార్య బుష్రా కూడా జైలులోనే ఉన్నారు.