పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం..చేతులెత్తేసిన ప్రభుత్వం

పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం..చేతులెత్తేసిన ప్రభుత్వం

ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్తాన్ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నది. ఉక్రెయిన్– రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో బొగ్గు, నేచురల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినయ్. దీంతో  పవర్ ప్లాంట్లకు అవసరమైనంత బొగ్గు, గ్యాస్ ను ప్రభుత్వం కొనుగోలు చేయలేక పోతోంది. ఫలితంగా పవర్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయట్లేదు. కొన్ని ప్లాంట్లను ప్రభుత్వం టెంపరరీగా మూసేసింది. ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్​కు తగినంత కరెంట్​ సప్లై చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇండ్లు, పరిశ్రమలకు కరెంట్​ సప్లైలో కోతలు పెడుతోంది. తొమ్మిది నెలల్లో పాకిస్తాన్ ఇంధన కొనుగోళ్ల విలువ రెట్టింపై, ఏకంగా 15 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో పాటు రవాణా చార్జీలు కూడా ఎక్కువవడంతో విద్యుత్ ప్లాంట్లకు సరిపడా ఇంధనాన్ని సరఫరా చేయలేకపోతున్నది. పవర్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యం మేరకు పని చేయకపోవడంతో 3,500 మెగావాట్లతో పాటు సాంకేతిక కారణాల వల్ల మరో 3,500 మెగావాట్ల పవర్ ఉత్పత్తి చేయడంలేదని ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయేల్ ట్విట్టర్ లో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తయ్యే కరెంట్​లో ఐదో వంతు(7వేల మెగావాట్లు) ఉత్పత్తి తగ్గిపోయిందని ఆరిఫ్ అబీబ్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ తాహిర్ అబ్బాస్ పేర్కొన్నారు.  కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎనర్జీ మినిస్టర్​ను నియమించకపోవడంతో ఆ శాఖపై పర్యవేక్షణ లేకుండా పోయింది. విదేశాల నుంచి నేచురల్ గ్యాస్, బొగ్గును భారీగా దిగుమతి చేసుకోవడం పాకిస్తాన్​కు తలకు మించిన భారంగా మారింది. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పట్లో మారే అవకాశంలేదని, రేట్లు తగ్గితే కాని సాధారణ స్థితికి చేరుకోదని పాకిస్తాన్–కువైట్ ఇన్వెస్ట్​మెంట్ కంపెనీ రిసెర్చ్ హెడ్ సమీయుల్లా తారిఖ్ హెచ్చరించారు.

ఫ్యూయెల్​ బడ్జెట్​ తగ్గించుకోండి

 ఖాట్మండు: దేశంలో తగ్గిపోతున్న ఫారిన్ ఎక్ఛేంజ్ నిల్వలు, ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరల పెరుగుదల  కారణంగా అన్ని గవర్నమెంట్ ఏజెన్సీలు, మినిస్ట్రీస్ కి 20% వరకు ఇంధన బడ్జెట్​లో కోత విధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీస్​లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్స్ మినిస్ట్రీ సోమవారం వెల్లడించింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు, కంపెనీలు తమ ఫ్యూయెల్ బడ్జెట్​లో 20% తగ్గించుకోవాలని సూచించింది. కాగా, డెవలప్ మెంట్ ప్రాజెక్టులు, శాంతి భద్రతలు, అత్యవసర సేవలు, రాబోయే స్థానిక ఎన్నికల శాఖకు ఈ నిర్ణయం వర్తించదని పేర్కొన్నది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడంతో పాటు కోవిడ్–19 తర్వాత టూరిజంపై వచ్చే ఆదాయం కూడా తగ్గడంతో నేపాల్ ​ఖజానాలో ఫారిన్ ఎక్ఛేంజ్ నిల్వలు కూడా తగ్గాయి.