మరో శ్రీలంకగా పాకిస్తాన్!

మరో శ్రీలంకగా పాకిస్తాన్!

మరో శ్రీలంకగా పాకిస్తాన్!

ఆర్థిక సంక్షోభంతో విలవిల 

ఇస్లామాబాద్ : పాకిస్థాన్​ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికే నిత్యావసరాలపై ఇచ్చే రాయితీలో కోత పెట్టింది. ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్​పై సబ్సిడీ ఎత్తేస్తారేమో అన్న భయంతో ఆ దేశ ప్రజలు ఎల్​పీజీ గ్యాస్​ను ప్లాస్టిక్‌ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. కరెంట్ ఆదా చేసుకునేందుకు షాపింగ్ మాల్స్, మార్కెట్లను రాత్రి 8.30 గంటలకే మూసివేయాలని సర్కారు ఆదేశించింది. ఈ పరిస్థితులన్నీ చూస్తే.. పాకిస్తాన్​ మరో శ్రీలంకగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా కరిగిపోతున్నాయి. పాకిస్థాన్ మారక నిల్వలు 6.7 బిలియన్​ డాలర్లకు తగ్గాయి. దీనికితోడు పాకిస్థాన్​కు చైనా చిల్లి గవ్వ ఇవ్వట్లేదు. ఇన్వెస్ట్​మెంట్లు తగ్గించింది. మరోవైపు పాకిస్థాన్​ను రాజకీయ అనిశ్చితి వెంటాడుతున్నది.

డిఫాల్ట్​ భయం

నవంబర్​లో పూర్తి కావాల్సిన తొమ్మిదో రివ్యూ ప్రోగ్రాంలో తలెత్తిన విభేదాల కారణంగా ఐఎంఎఫ్ 1.1 బిలియన్​ డాలర్ల సాయాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్​కు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్స్​లో డిఫాల్ట్​ భయం పట్టుకుంది. ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. కరెంట్ ఆదా కోసం  ఫిబ్రవరి నుంచి బల్బులు, జులై నుంచి ఫ్యాన్ల తయారీని నిలిపివేస్తామని ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని సగానికిపైగా వీధి లైట్లను ఆన్ చేయట్లేదు. 

శ్రీలంకకు అండగా నిలిచిన ఇండియా

శ్రీలంక కూడా ఇదే తరహాలో ఏడాదిగా పెరుగుతున్న ధరలతో పోరాడుతున్నది.  ఏడు దశాబ్దాలతో పోలిస్తే.. అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది.  కరోనా కారణంగా టూరిజం పడిపోయింది. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా దిగుమతులు పడిపోవడంతో సరుకుల ధరలు పెరిగాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్​ ధరలు ఆకాశాన్నంటాయి. జులైలో ఆ దేశ అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. తర్వాత ఐఎంఎఫ్​తో 2.9 బిలియన్​ డాలర్ల లోన్​ కోసం శ్రీలంక డీల్ కుదుర్చుకుంది. ఆ టైంలో శ్రీలంకకు ఇండియా అండగా నిలిచింది. జనవరి నుంచి జులై మధ్య 4 బిలియన్​ డాలర్ల సాయం అందించింది.

రాయితీలు ఎత్తేస్తున్న పాక్​ సర్కార్​

పెట్రోల్, డీజిల్​పై సబ్సిడీ ఎత్తేసినట్టు గ్యాస్​పై ఎత్తేస్తారేమో అని నార్త్ వెస్ట్రన్ రీజియన్​లోని ఖైబర్​ పఖ్తున్​ఖ్వా ప్రావిన్స్​ ప్రజలు గ్యాస్​ను స్టోర్​ చేసుకుంటున్నారు. ఎల్‌పీజీ గ్యాస్‌ను నిల్వ చేసుకునేందుకు పెద్ద పెద్ద ప్లాస్టిక్‌ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. గ్యాస్‌ పైపులైన్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దుకాణల వద్దకు ప్లాస్టిక్‌ బ్యాగులను తీసుకెళ్లి అందులో వంట గ్యాస్‌ను నింపించుకుంటున్నారు. లీకేజ్​ కాకుండా 3 నుంచి 4 కిలోల బ్యాగులకు నాజల్, వాల్వ్‌ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత వాటిని ప్రజలకు అమ్ముతున్నట్టు అల్ అరేబియా సంస్థ చెప్పింది. దీనికితోడు ఆహార సంక్షోభం కూడా తీవ్రమైంది. ఫుడ్ ఇన్ ఫ్లేయేషన్​ 35.5శాతానికి పెరిగింది. ట్రాన్స్​పోర్ట్ ధరలు డిసెంబర్‌లో 41.2 శాతం పెరిగాయి.