
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,932 కొత్త కేసులు నమోదయ్యాయని అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ బుధవారం ప్రకటించింది. దీంతో వైరస్ బారిన పడినవారి సంఖ్య 45,898 చేరుకుందని తెలిపింది. కరోనాతో గడిచిన ఒక్కరోజులో 48 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 985కు పెరిగింది. సింధ్‌లో 17,947 కరోనావైరస్ కేసులు, పంజాబ్‌లో 16,685, ఖైబర్-పఖ్తుంఖ్వా 6,554, బలూచిస్తాన్ 2,885, ఇస్లామాబాద్ 1,138, గిల్గిట్-బాల్టిస్తాన్ 556, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 133 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 13,101 మంది రోగులు వైరస్ నుంచి కోలుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 4,14,245 మందికి టెస్టులు నిర్వహించామని ప్రకటించింది. లాక్డౌన్ ఆంక్షలను సడలించిన అక్కడి ప్రభుత్వం పాక్షికంగా దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభించింది.