టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్ మ్యాచ్​ కప్‌ ఎవరిదో?

టీ20  వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్  మ్యాచ్​ కప్‌ ఎవరిదో?

టీ20 వరల్డ్‌‌కప్‌‌  టైటిల్‌‌ ఫైట్‌‌ ఆదివారం ఇంగ్లండ్‌‌-పాకిస్తాన్​ మధ్య  మెల్‌‌బోర్న్‌‌లో జరగనుంది. హిస్టరీ పాక్‌‌కు అనుకూలంగా ఉంటే.. ఫామ్‌‌ పరంగా ఇంగ్లీష్‌‌ జట్టు ముందుంది.

మెల్‌‌బోర్న్‌‌: దాదాపు నెల రోజుల పాటు ప్రపంచ క్రికెట్‌‌ను అలరించిన టీ20 వరల్డ్‌‌కప్‌‌లో టైటిల్‌‌ ఫైట్‌‌కు సమయం ఆసన్నమైంది. ఆదివారం ప్రఖ్యాత మెల్‌‌బోర్న్‌‌లో జరిగే ఫైనల్‌‌ పోరులో బలమైన ఇంగ్లండ్‌‌తో నిలకడలేని పాకిస్తాన్‌‌ అమీతుమీ తేల్చుకోనుంది. హిస్టరీ పాక్‌‌కు అనుకూలంగా ఉంటే.. ఫామ్‌‌ పరంగా ఇంగ్లిష్‌‌ జట్టు అందనంత ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో కప్‌‌ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌ను ఊపేస్తున్నది. అయితే ఇద్దరిలో ఎవరు ట్రోఫీ గెలిచినా.. రెండుసార్లు విజేత అయిన వెస్టిండీస్‌‌ (2012, 2016) సరసన చోటు సంపాదిస్తారు. 2009లో పాక్‌‌ ట్రోఫీ నెగ్గితే.. 2010లో ఇంగ్లండ్‌‌ చాంపియన్‌‌గా నిలిచింది. అయితే ఇందులో డబుల్‌‌ మ్యాజిక్‌‌ చేసేది ఎవరు? అలాగే 1992 ఫలితాన్ని ఎవరు రిపీట్‌‌ చేస్తారు? అప్పట్లో ఇదే గ్రౌండ్‌‌లో జరిగిన వన్డే వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్లో ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ బృందం.. ఇంగ్లండ్‌‌కు షాకిస్తూ తొలిసారి విజేతగా నిలిచింది. దీంతో బాబర్‌‌ ఆ ఫలితాన్ని కోరుకుంటుంటే.. బట్లర్‌‌ ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్​కు వర్షం ముప్పు ఉండటంతో ఐసీసీ రూల్స్​ను సవరించింది. సోమవారం (రిజర్వ్​ డే) నిర్ణీత టైమ్​లోగా వర్షం ఆగకపోతే అదనంగా మరో రెండు గంటలు వేచి చూడనుంది. దీంతో కనీసం 10 ఓవర్ల మ్యాచైనా ఆడించాలని యోచిస్తున్నది. ఒకవేళ ఇదీ సాధ్యం కాకపోతే ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 

ఓపెనర్లే కీలకం..

మెగా ఈవెంట్‌‌లో పాక్‌‌ ప్రయాణం సాఫీగా సాగలేదు. సూపర్‌‌–12లో ఇండియా, జింబాబ్వే చేతిలో ఓడిన తర్వాత బాబర్‌‌సేన ఫైనల్‌‌కు చేరుకోవడం ఓ హాలీవుడ్‌‌ థ్రిల్లర్‌‌ను తలపించింది. కానీ సెమీస్‌‌లో న్యూజిలాండ్‌‌పై ఆడిన తీరు పాక్‌‌ను టైటిల్‌‌ ఫైట్‌‌కు తీసుకొచ్చింది. అంటే తమదైన రోజున ఎంత పెద్ద ప్రత్యర్థినైనా మట్టి కరిపించే సత్తా దాయాది జట్టు సొంతం. ఇప్పుడు ఇంగ్లండ్‌‌పై కూడా అదే తరహా ఆటను చూపెడతారా? అలా చూపాలంటే ఓపెనర్లు కెప్టెన్‌‌ బాబర్‌‌, రిజ్వాన్‌‌ క్రీజులో నిలబడాలి. వీరికి తోడుగా హారిస్‌‌ అండగా నిలవాలి. ఈ త్రయం చెలరేగితేనే భారీ స్కోరు ఖాయం. మిడిలార్డర్‌‌లో మసూద్‌‌, ఇఫ్తికార్‌‌, మహ్మద్‌‌ నవాజ్‌‌ కుదురుకుంటే ఇంగ్లిష్‌‌ టీమ్‌‌కు కష్టాలు తప్పవు. అయితే పాక్‌‌ బ్యాటింగ్‌‌ కంటే బౌలింగే డేంజర్‌‌గా కనిపిస్తున్నది. పేసర్లు షాహిన్‌‌ ఆఫ్రిది, నసీమ్‌‌ షా, హారిస్‌‌ రవూఫ్‌‌, మహ్మద్‌‌ వసీమ్‌‌ ఫామ్‌‌లో ఉండటం సానుకూలాంశం. స్పిన్నర్లుగా షాదాబ్‌‌, నవాజ్‌‌ మిడిల్‌‌ ఓవర్స్‌‌లో మెరిస్తే ఇబ్బందులు తప్పినట్లే. అయితే ఒక్కరు విఫలమైతే.. మిగతా వారు పెవిలియన్‌‌ క్యూ కడతారనే అతిపెద్ద అపవాదును పాక్‌‌ అధిగమిస్తే ఈ మ్యాచ్‌‌లో సగం గెలిచినట్లే. 

‘టాప్‌‌’ లేపితే..

నిఖార్సైన టీ20 ఆల్‌‌రౌండర్లతో ఇంగ్లండ్‌‌ చాలా బలంగా కనిపిస్తున్నది. గాయాలతో సెమీస్‌‌కు దూరమైన మార్క్‌‌వుడ్‌‌, మలన్‌‌ అందుబాటులోకి రావడం ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ డెప్త్‌‌ను పెంచింది. ఓపెనింగ్‌‌లో బట్లర్‌‌, హేల్స్‌‌ను ఆపితేనే పాక్‌‌ ఈ మ్యాచ్‌‌లో నిలుస్తుంది. కానీ బీబీఎల్‌‌లో చితక్కొట్టిన హేల్స్‌‌.. ఇండియాపై చూపిన పెర్ఫామెన్స్‌‌ను రిపీట్‌‌ చేయాలని భావిస్తున్నాడు. ఆల్‌‌రౌండర్‌‌గా బెన్‌‌ స్టోక్స్‌‌ ఈ మ్యాచ్‌‌లో అత్యంత కీలకంకానున్నాడు. వన్డే వరల్డ్‌‌కప్‌‌ను అందించిన అతను పొట్టి కప్‌‌ను కూడా రెండోసారి సాధించాలని ప్లాన్స్‌‌ వేస్తున్నాడు. మెయిన్‌‌ అలీ మిడిలార్డర్‌‌ బ్యాటర్‌‌గా, టాప్‌‌ స్పిన్నర్‌‌గా ద్విపాత్రాభినయం చేయడానికి రెడీగా ఉన్నాడు. బ్రూక్‌‌, లివింగ్‌‌స్టోన్‌‌ చెలరేగితే పాక్‌‌కు ఇబ్బందులు తప్పవు. మరో ఆల్‌‌రౌండర్‌‌ సామ్‌‌ కరణ్‌‌ను ఇప్పటి వరకు బౌలర్‌‌గానే చూశాం. కానీ ఈ మ్యాచ్‌‌లో తన బ్యాటింగ్‌‌ సత్తాను బయటకు తీసేందుకు వేచి చూస్తున్నాడు. వోక్స్‌‌, వుడ్‌‌, జోర్డాన్‌‌, విల్లే పేరుకే పేసర్లు అయినా పక్కా ఆల్‌‌రౌండర్లు. స్పిన్నర్‌‌గా రషీద్‌‌పై పూర్తి నమ్మకం పెట్టొచ్చు. 

జట్లు (అంచనా)

ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), హేల్స్‌, మలన్‌ / ఫిల్‌ సాల్ట్‌, స్టోక్స్‌, హారి బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌ వుడ్‌ / జోర్డాన్‌ / డేవిడ్‌ విల్లే,  రషీద్‌. 

పాకిస్తాన్‌: బాబర్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌, హారిస్‌, షాన్‌ మసూద్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌, మహ్మద్‌ వసీమ్‌, నసీమ్‌ షా, హారిస్‌ రవూఫ్‌, షాహిన్‌ ఆఫ్రిది.