టర్కీ ప్రజలకు పాక్​ పౌరుడి సాయం..

టర్కీ ప్రజలకు పాక్​ పౌరుడి సాయం..
  • అజ్ఞాత వ్యక్తి డొనేట్​ చేసిండు.. పాక్​ పీఎం షెహబాజ్
  • కష్టాల్లో ఉన్న సొంత దేశానికి ఎందుకివ్వలేదు?..
  • ట్విట్టర్​లో ప్రధానికి ప్రశ్నలు


ఇస్లామాబాద్:భూకంపంతో అతలాకుతలమైన టర్కీ దేశానికి పాకిస్తాన్ పౌరుడు ఒకరు 30 మిలియన్ డాలర్లు విరాళం ఇచ్చారని శనివారం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్​ తెలిపారు. తమ దేశానికి చెందిన ఒక వ్యక్తి ఎంతో పెద్ద సాయంతో ఉదారతను చాటుకున్నారని అన్నారు. ‘‘ఓ అజ్ఞాత పాకిస్తాన్​ పౌరుడు అమెరికాలోని టర్కీ ఎంబసీకి వెళ్లి 30 మిలియన్ ​డాలర్లు విరాళం ఇచ్చారు. భూకంప బాధితుల కష్టాలు చూసి కదిలిపోయిన అతను ఈ సాయం అందించారు. ఇవి అసమానతలపై విజయం సాధించేందుకు మానవత్వంతో చేసే గొప్ప పనులు” అని ట్విట్టర్​లో షరీఫ్ పేర్కొన్నారు. అయితే పాక్ ప్రధాని చేసిన ఈ ప్రకటనపై ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు.

మీలాంటి అవినీతిపరుల వల్లే

కరెన్సీ విలువ పడిపోయి, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి పాక్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉండి, సొంత దేశ ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ ఆ అజ్ఞాత వ్యక్తి పాకిస్తాన్‌‌కు ఎందుకు విరాళంగా ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. “ఆ పరోపకారి పాక్ ఎంబసీకి వెళ్లి వరద సహాయక చర్యల కోసం డబ్బు ఎందుకు ఇవ్వలేదనేది చాలా ఇంట్రెస్టింగ్” అని రచయిత్రి అయేషా సిద్దిఖా కామెంట్ చేశారు. “ఆ అజ్ఞాత వ్యక్తి పాకిస్తానీ అని మీకెలా తెలుసు? అతను ఇండియన్​అయి ఉండొచ్చు కదా? తన పేరు కూడా చెప్పని వ్యక్తి జాతీయతను మాత్రం వెల్లడించాడా?.. చాలా గ్రేట్” అని ఆమె ట్వీట్ చేశారు. “అలాంటి మానవతా వాదులు పాక్ ఎంబసీకి వెళ్లక పోవడానికి ఒక కారణం ఉంది. అది మీలాంటి అవినీతి మనీలాండర్లే’’ అని మరొకరు హెహబాజ్, అతని సారథ్యంలోని ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘మీరు ప్రధానిగా ఉన్నాసరే కష్టాల్లో ఉన్న మాతృదేశానికి సాయం చేయలేదంటే కారణం.. అధికారపీఠంపై దొంగలు కూర్చున్నారనే అర్థం” అని మరో వ్యక్తి మండిపడ్డారు.