ఇస్లామాబాద్: పాకిస్తాన్ భద్రతా బలగాలు టెర్రర్ గ్రూప్ తెహ్రీక్ -ఇ -తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన తొమ్మిది మంది టెర్రరిస్టులను కాల్చి చంపాయి. తమ సెక్యూరిటీ ఫోర్సెస్ శుక్రవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని టాంక్, లక్కీ మార్వత్ జిల్లాల్లో సెపరేట్ ఆపరేషన్లు నిర్వహించాయని పాక్ మిలటరీ మీడియా వింగ్ వెల్లడించింది.
టాంక్‌లో టెర్రరిస్టులున్నట్లు సమాచారం అందడంతో ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్(ఐబీవో) నిర్వహించినట్లు తెలిపింది. అయితే, టెర్రరిస్టులు సోల్జర్లపై కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయని చెప్పింది. ఈ ఘటనలో ఏడుగురు టెర్రరిస్టులు హతమయ్యారని పాక్ మిలటరీ మీడియా వింగ్ వివరించింది. అలాగే..లక్కీ మార్వత్‌లోనూ భద్రతా బలగాలు మరో ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చినట్లు ప్రకటించింది.
