
పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పాకిస్తాన్ కపట నాటకాలు ఆడుతోంది. భారత్ తో శాంతి చర్చలకు సిద్ధమంటూనే ఉగ్రవాద సంస్థలకు వంత పాడుతోంది. పుల్వామాలో దాడికి పాల్పడింది జైషే మహ్మద్ సంస్థ అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవన్నారు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమద్ ఖురేషీ. భారత్ సరైన ఆధారాలు చూపిస్తే తప్ప ఈ విషయంలో జైషే పై ఎటువంటి చర్యలు తీసుకోలేమన్నారు. జైషే చీఫ్ అజర్ తో తమ ప్రభుత్వం టచ్ లో ఉందన్నారు ఖురేషీ.
అయితే ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన వెంటనే తామే దాడి చేశామని ప్రకటించుకుంది జైషే మహ్మద్. భారత్ లో ఎప్పుడైనా దాడి చేయడానికి సిద్ధమని కూడా చెప్పింది. జైషే మహ్మద్ సంస్థే తామే దాడి చేశామని ప్రకటించుకున్నా.. పాక్ సర్కార్ వెనకేసుకురావడం వారి ద్వంద వైఖరిని సూచిస్తోంది. మసూద్ పాకిస్తాన్ లో ఉన్నాడని నిన్ననే ప్రకటించారు పాక్ విదేశాంగ శాఖ మంత్రి. ఆనారోగ్యంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ప్రకటన చేసిన మంత్రే 24 గంట్లలోనే జైష్ మహ్మద్ ను సమర్ధిస్తూ ప్రకటన చేయడంపై భారత్ మండిపడుతోంది.
అజర్ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేశాయి మూడు అగ్రదేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్. దీనిపై 8 రోజుల్లోగా UNO నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలో జైష్ ఉగ్రవాద సంస్థను సమర్ధిస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన చేయడం కలకలం రేపుతోంది.