17 లక్షల మంది దేశం విడిచి వెళ్లాలని పాక్ ఆదేశం

17 లక్షల మంది దేశం విడిచి వెళ్లాలని పాక్ ఆదేశం

పాకిస్థాన్ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఉన్న ఆఫ్ఘన్ శరణార్థులను వెంటనే పాకిస్థాన్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. లేనిపక్షంలో వారిని పాకిస్థాన్ నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. నవంబర్ 1  తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. లేకుంటే భద్రతా దళాల సాయంతో బలవంతంగా తరిమేస్తామని ప్రకటించింది. అఫ్ఘానిస్థాన్ నుంచి పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందిన వారి సంఖ్య 17 లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.

తమ అనుమతి లేకుండా పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన వారిని వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. లేకుంటే బలవంతంగా తమిమేస్తామని హెచ్చరించింది. పాకిస్థాన్‌లోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ప్రకారం ఇప్పటికే వందలాది మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత చాలా మంది ఆఫ్ఘన్లు పాకిస్థాన్‌కు శరణార్థులుగా వచ్చారు. 

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం సుమారు 13 లక్షల మంది ఆఫ్ఘన్ పౌరులు శరణార్థులుగా నమోదు చేసుకున్నారు. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధృవీకరించబడ్డారు. మరో 17 లక్షల మంది తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి సర్ఫరాజ్ బుగిటి ఇటీవల ప్రకటించారు.

అక్రమంగా వచ్చిన వారందరూ నవంబర్ 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని.. లేకుంటే భద్రతా బలగాల సాయంతో గుర్తించి బలవంతంగా బహిష్కరిస్తామన్నారు. నవంబర్ తర్వాత పాస్‌పోర్ట్ , వీసా లేకుండా ఎవరూ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు. పాకిస్థాన్ పౌరులు కాకపోయినా.. ఐడీ కార్డులున్న వారి జాతీయతను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షను ఉపయోగిస్తామని సర్ఫరాజ్ బుగిటి సంచలన వ్యాఖ్యలు చేశారు.