పాలమూరు క్లస్టర్కు అడుగులు..కేంద్ర ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు

పాలమూరు క్లస్టర్కు అడుగులు..కేంద్ర ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లతో ప్రతిపాదనలు
  • క్లస్టర్​ పరిధిలోకి మహబూబ్​నగర్, జడ్చర్ల, భూత్పూర్​ మున్సిపాల్టీలు
  • విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు అవకాశాలు
  • శివారు ప్రాంతాల చుట్టూ గ్రీన్ బెల్ట్​ ఏర్పాటుకు చర్యలు

మహబూబ్​నగర్, వెలుగు:పాలమూరు క్లస్టర్​కు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర సర్కారుకు రూ. వెయ్యి కోట్లతో ప్రపోజల్స్​ పంపించారు. కేంద్రం గ్రీన్​ సిగ్నల్​ ఇస్తే జడ్చర్ల, భూత్పూర్​ మున్సిపాల్టీలు, పాలమూరు కార్పొరేషన్​ను కలుపుకొని మహబూబ్​నగర్​ క్లస్టర్​గా ఏర్పాటు కానుంది. క్లస్టర్  డెవలప్​మెంట్​ ప్రాజెక్టు కింద క్లస్టర్​గా గుర్తించి, అర్బన్​ చాలెంజ్​ ఫండ్స్(యూసీఎఫ్​)​ను మంజూరు చేయాలని ఇటీవల ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి కేంద్ర హౌసింగ్, అర్బన్​ అఫైర్స్​ మినిస్టర్​ మనోహర్​ లాల్​ కట్టర్​ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి రిపోర్టును అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించగా.. త్వరలో యూసీఎఫ్​ కింద నిధులు మంజూరయ్యే అవకాశాలున్నాయి.

కేంద్రానికి  ప్రైమరీ రిపోర్ట్..

మహబూబ్​నగర్​ కార్పొరేషన్, జడ్చర్ల, భూత్పూర్​ మున్సిపాల్టీలను కలుపుతూ క్లస్టర్​ ఏర్పాటుకు సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్టు కేంద్రానికి పంపించారు. జాతీయ రహదారులు ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉన్నాయి, నీటి వనరులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, రైల్వే లైన్​ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మున్సిపల్​ బౌండరీలు ఎంత వరకు ఉన్నాయి, జల మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై రాష్ట్ర మున్సిపల్​ అడ్మినిస్ర్టేషన్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్ డిపార్ట్​మెంట్​ రిపోర్టు అందజేసింది. వీటితో పాటు సాగు భూములు, బంజర్​ భూములు, ఓపెన్​ ల్యాండ్స్, వృక్ష సంపద వివరాలను మ్యాపుల ద్వారా వివరించారు.

రూ.978.48 కోట్లతో ప్రపోజల్స్..

క్లస్టర్​లో అభివృద్ధి పనుల కోసం యూపీఎఫ్​ కింద రూ.978.48 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. నిధులు మంజూరైతే బస్​ ర్యాపిడ్​ ట్రాన్సిస్ట్​ సిస్టం అమలు చేస్తారు. ఎలక్ట్రిక్​ బస్సులు, ఈ- రిక్షాలు, క్లస్టర్​ పరిధిలో చివరి కిలోమీటరు వరకు రవాణా వ్యవస్థను మెరుగుపరచనున్నారు. పట్టణాలు, నగరాల్లో సిటీ బస్సు సర్వీసు నెట్​వర్క్​ను అభివృద్ధి చేస్తారు. ఫ్యూచర్​లో రైల్వేతో అనుసంధానం చేసే కార్యక్రమాలు చేపడతారు. దీంతో రవాణా వ్యవస్థ మెరుగు పడుతుంది.

రోడ్ల పక్కన సేఫ్టీ ఫుట్​పాత్​లు, సైకిల్​ ట్రాక్​లను నిర్మిస్తారు. రోడ్లకు ఇరు వైపులా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడతారు. పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్​ సమస్యను అధిగమించేందుకు ప్రతి మండలానికి రోడ్డు కనెక్టివిటీని మెరుగు పర్చడంతో పాటు ఆయా మండలాల నుంచి మరో మార్గం గుండా వాహనాలు వెళ్లేలా రోడ్లను డెవలప్​ చేస్తారు. రద్దీగా ఉండే జంక్షన్లను విస్తరించడంతో పాటు ప్రతి జంక్షన్​ వద్ద హైమాస్ట్​ లైట్లను ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్​ ఇబ్బందులు రాకుండా సిగ్నల్స్​ అందుబాటులోకి తెస్తారు.

అమృత్​ 2.0 కింద తాగునీటి సంపులు, తాగునీటి పైపులైన్లు, పంప్​ హౌస్, సిబ్బందికి క్వార్టర్స్, ఇతర ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ను డెవలప్​ చేస్తారు. విద్య, వైద్యం, ఉపాధి, సంస్కృతికం, క్రీడలు, కమ్యూనిటీ సెంటర్లు, ఆడిటోరియాలు, హెల్త్ సెంటర్లు, లైబ్రరీలు, పార్కులు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేలా స్టార్టప్ ఇంక్యుబేషన్  హబ్​లను ఏర్పాటు చేస్తారు. క్రీడా మైదానాలు, ఫంక్షన్ హాల్స్​ను నిర్మిస్తారు. గ్రీన్ బెల్ట్  అభివృద్ధి చేసి ఉద్యానవనాలు, తోటలు, అడవుల అభివృద్ధితో పర్యావరణాన్ని మెరుగు పరుస్తారు.

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సహకారంతో..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాలూమరు క్లస్టర్​ను ఏర్పాటు​ చేస్తాం. క్లస్టర్​ ఏర్పాటైతే ఈ ప్రాంతం చాలా డెవలప్​ అవుతుంది. క్లస్టర్​లోని పాలమూరు, జడ్చర్ల, భూత్పూర్  ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడతాయి. కంపెనీలు రావడం వల్ల యువతకు ఉపాధి దొరుకుతుంది. గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి పట్టణాలు, నగరానికి రోడ్ల కనెక్టివిటీ పెరిగి, రవాణా వ్యవస్థ మెరుగు పడుతుంది.- యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్​నగర్​

రోడ్డు నెట్​వర్క్  కిలోమీటర్లలో..​

మహబూబ్​నగర్​    :    797.67
భూత్పూర్​              :      141.5
జడ్చర్ల                        133.52

2011 లెక్కల ప్రకారం జనాభా..

మహబూబ్​నగర్​    : 2,17,143
భూత్పూర్​              :    12,917
జడ్చర్ల                   :    52,128