అట్టహాసంగా వంశీ నామినేషన్​ .. హాజరైన సీఎం రేవంత్​రెడ్డి

అట్టహాసంగా వంశీ నామినేషన్​ .. హాజరైన సీఎం రేవంత్​రెడ్డి
  •     మెట్టుగడ్డ చౌరస్తా నుంచి కలెక్టరేట్​ వరకు భారీ ర్యాలీ

పాలమూరు, వెలుగు: పాలమూరు కాంగ్రెస్​​ ఎంపీ క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డి నామినేషన్​ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డి హాజరు కావడంతో పాటు మహబూబ్​నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, షాద్​నగర్​ ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.

సీఎం హైదరాబాద్​ నుంచి ప్రత్యేక కాన్వాయ్​లో బయల్దేరారు. జడ్చర్లకు చేరుకోగా, అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన మహబూబ్​నగర్​లోని మెట్టుగడ్డ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మెట్టుగడ్డ నుంచి ప్రారంభమైన ర్యాలీ న్యూటౌన్​, వన్​టౌన్​ మీదుగా కలెక్టరేట్​ వరకు సాగింది. సీఎంతో కలిసి వంశీచంద్​రెడ్డి నామినేషన్​ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్​ అధికారి, కలెక్టర్​ రవినాయక్​కు అందజేశారు. 

అక్కడి నుంచి క్లాక్​టవర్​ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో సీఎం మాట్లాడారు. అంతకుముందు చల్లా వంశీచంద్​రెడ్డి మాట్లాడుతూ సీఎం అండతో ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశ్వీరందించి గెలిపిస్తే ఢిల్లీలో వారధిగా ఉండి ఐదేండ్లు సేవ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సీఎం 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మూడు నెలల్లోనే రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేసుకుంటున్నట్లు చెప్పారు.

గత పదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరుకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదని విమర్శించారు. ఈ తరుణంలో సీఎం జిల్లా చరిత్రను తిరగరాసేలా పాలమూరును అభివృద్ధి చేసేందుకు కసితో పని చేస్తున్నారన్నారు. ముదిరాజులను గత ప్రభుత్వం విస్మరించిందన్నారు. బీజేపీ ఎంపీ క్యాండిడేట్​ డీకే అరుణ తమ పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిచి, ముదిరాజ్ బిడ్డను ఓడగొట్టేందుకు కుట్ర చేశారని విమర్శించారు. ముదిరాజులను బీసీ–-డి నుంచి బీసీ–--ఏ గ్రూపులో చేర్చేందుకు సీఎం కృషి చేస్తారన్నారు. రేవంత్ రెడ్డికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆయన గౌరవాన్ని ఢిల్లీలో చాటేలా చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, కార్నర్​ మీటింగులో సీఎంపై ముదిరాజ్​లు పూలు చల్లి తమ కృతజ్ఞతను చాటారు. 

రెండో రోజు ఐదు నామినేషన్​లు..

మహబూబ్​నగర్​ పార్లమెంట్​ స్థానానికి రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్​ అధికారి రవినాయక్​ తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ నుంచి చల్లా వంశీచంద్​ రెడ్డి రెండు సెట్లు, బీఆర్ఎస్​ క్యాండిడేట్​ మన్నే శ్రీనివాస్​రెడ్డి తరపున ప్రపోజర్​ టి.శ్రీధర్ రెడ్డి ఒక సెట్, ఇండిపెండెంట్లుగా హరీందర్ రెడ్డి, ఎస్  సరోజమ్మ, ఉమాశంకర్​ ఒక్కో సెట్​ నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 8 నామినేషన్లు వచ్చినట్లు ఆర్వో తెలిపారు.