పొద్దంతా ఈదురు గాలులు.. రాత్రంతా ముసురు..ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరిపినివ్వని వాన

పొద్దంతా ఈదురు గాలులు.. రాత్రంతా ముసురు..ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెరిపినివ్వని వాన

నెట్​వర్క్, వెలుగు:ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా వర్షాలు దంచి కొడుతుండగా.. రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఉదయం పూట ఈదురు గాలులతో ముసురు పడుతుండగా.. రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మహబూబ్​నగర్​ జిల్లా చిన్నచింతకుంట మండలంలో 59.3 మిల్లీమీటర్ల వర్షపాతం, మూసాపేటలో 51.6, కౌకుంట్లలో 44.8, హన్వాడలో 44.6, గండీడ్​లో 41.6, నారాయణపేటలో 60.2, గుండుమాల్​ 55.5, మరికల్​లో 53.6, దామరగిద్దలో 51.2, ఊట్కూరులో 47.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
    
ఊట్కూరు  మండలం పగిడిమారి, ఓబులాపురం, అమీన్​పూర్, సాతనూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నచింతకుంట మండలం సీతారాంపేట్  వద్ద మన్నేవాగు వరద నీరు బ్రిడ్జిపై నుంచి పారుతుండడంతో అధికారులు కంచె ఏర్పాటు చేసిన రాకపోకలను నిలిపివేశారు. మాగనూరు మండలం అడవిసత్యారం, వద్వాట్  గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మక్తల్​ మండలం కర్ని వద్ద రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్ద వాగును కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ పరిశీలించి రాకపోకలు బంద్​ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. వర్షాలకు పలు చోట్ల ఇండ్లు కూలిపోయాయి.
    
దుందుభి, ఊకచెట్టు వాగులు పొంగి ప్రవహించడంతో అడ్డాకుల మండలం గుండిబండ వద్ద, జడ్చర్ల మండలం నెక్కొండ సమీపంలోని చెక్​డ్యాం కొట్టుకుపోయాయి. హన్వాడ మండలం ఇబ్రహీంబాద్​లోని హేమసముద్రం చెరువుకు గండి పడింది. సంగంబండ రిజర్వాయర్​ ఏడు గేట్లను, కోయిల్​సాగర్​ మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
    
జోగులాంబ గద్వాల జిల్లాలో మానవపాడు, అమరవాయి గ్రామాల మధ్య, ఉండవెల్లి మండలం మెన్నిపాడు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అయిజ, ఉత్తనూరు గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగి ప్రవహిస్తోంది. అయిజ, మంత్రాలయం మార్గంలో పోలోని వాగు ప్రవాహంతో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రాజోలి, వడ్డేపల్లి మండలాల్లో భారీ వర్షంతో పంటలు నీట 
మునిగాయి. 
    
వనపర్తి జిల్లాలోని రామన్​పాడు ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సరళాసాగర్​ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో  3 ప్రైమ్, రెండు వుడ్​ సైఫన్లు ఆటోమేటిక్​గా తెరుచుకొని వరద నీరు కిందకు వెళ్తోంది. 730 మంది రైతులకు చెందిన 878 ఎకరాల పంటలు నీట మునిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఖిల్లాగణపురం, ఏదులలో రెండు ఇళ్లు కూలాయి. మరో 19 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రేమద్దుల, -కొల్లాపూరు మధ్య రాకపోకలు నిలిచిపోగా, మదనాపురం, -ఆత్మకూరు మధ్య నాలుగు రోజులుగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. శంకరంపేట, దంతనూరు గ్రామాల మధ్య రాకపోకలు బంద్​ అయ్యాయి.
    
నాగర్ కర్నూల్  చెరువు కట్టపైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కలెక్టర్  బదావత్  సంతోష్  కేసరి సముద్రం చెరువుతో పాటు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. ఎండబెట్ల గ్రామంతో పాటు సిరసవాడ, మాదారం మధ్య రాకపోకలను నిలిపివేయాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.