
- గత నెల ఒక బైపాస్ మంజూరు, మరో బైపాస్కు ప్రపోజల్
- తాజాగా జడ్చర్లకు జవహర్ నవోదయ విద్యాలయ
మహబూబ్‌నగర్, వెలుగు:పొలిటికల్ పార్టీల లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరాలు ఉంటాయి. ఒకరు కౌంటర్ ఇస్తే.. మరొకరు ఘాటు విమర్శలు చేస్తూ కౌంటర్ అటాక్‌కు దిగడం కామన్‌గా చూస్తుంటాం. ఎంపీ ఒక పార్టీ, ఎమెల్యేలు మరో పార్టీ వారైతే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ డెవలప్మెంట్ను గాలికి వదిలేస్తారు.
కానీ, పాలమూరు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి కొత్త ట్రెండ్‌కు బీజం వేస్తున్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన జిల్లా అభివృద్ధికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్య, వైద్యం, రవాణా, పట్టణ, నగర ఆధునీకరణ కోసం పని చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టి పెడుతూ ఫ్రెండ్లీ పాలిటిక్స్‌కు తెరలేపారు.
కలిసి వెళ్లి అనుమతులు సాధించుకొని..
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లోని పాలమూరు, జడ్చర్ల నియోజవర్గాల్లో డెవలప్మెంట్ పనుల కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తున్నారు. ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి తమ నియోజవర్గాల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఆ తరువాత ఎంపీని కలిసి వాటిని అందజేసి, జిల్లాకు జరిగే ప్రయోజనం గురించి వివరిస్తున్నారు. ఎంపీ వాటిని పరిశీలించి సంబంధిత కేంద్ర మంత్రులకు పంపిస్తున్నారు. ఆ తరువాత ముగ్గురు కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. డెవలప్మెంట్ పనులతో జరిగే ప్రయోజనాలను ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులకు వివరిస్తుండగా, ఎంపీ ఒత్తిడి తెస్తున్నారు.
పలు అభివృద్ధి పనులు మంజూరు..
నెలన్నర కింద పాలమూరుకు కేంద్రం నుంచి పలు అనుమతులు లభించాయి. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే అప్పన్నపల్లి ఫ్లై ఓవర్ నుంచి హన్వాడ మండలాన్ని కలుపుతూ వెళ్లే చించోలి హైవేకు లింక్ చేయనున్నారు. ఈ ఫ్లై ఓవర్ మంజూరు కోసం కొద్ది నెలల కింద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీ, పాలమూరు ఎమ్మెల్యే కలిశారు. గత నెల ఈ ఫ్లై ఓవర్‌ను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-167ను కలుపుతూ జడ్చర్ల మీదుగా బైపాస్ కోసం ఎంపీతో కలిసి ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి ఇటీవల గడ్కరినీ కలిశారు. పాలమూరు కార్పొరేషన్, జడ్చర్ల, భూత్పూర్ను క్లస్టర్‌గా ఏర్పాటు చేసేందుకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నిధులు మంజూరు కావాల్సి ఉంది. కృష్ణా–-వికారాబాద్ రైల్వే కోసం సర్వే చేయాల్సి ఉండగా.. నిధులు రాకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు. కొద్ది రోజుల కింద ఎంపీ ఈ నిధులను మంజూరు చేయించడంతో సర్వే పనులు పూర్తయ్యాయి.
జడ్చర్లకు నవోదయ విద్యాలయ..
మూడు రోజుల కింద కేంద్ర ప్రభుత్వం జడ్చర్లకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. ఈ విద్యాలయాన్ని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయాల్సి ఉండగా, స్థలం అందుబాటులో లేకపోవడంతో జడ్చర్ల నియోజకవర్గానికి కేటాయించారు. బాలానగర్ మండలం పెద్దాయపల్లి వద్ద సర్వే నంబరు 40, 42లలో 20 ఎకరాల భూమిని కేటాయించారు.
ఈ అకడమిక్ ఇయర్ నుంచే క్లాసులు ప్రారంభించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో మహబూబ్‌నగర్‌లోని పాతడీఆర్డీవో ఆఫీస్ కాంప్లెక్స్‌లోని దుర్గాబాయ్ మహిళా శిశు వికాస్ కేంద్రంలో తాత్కాలికంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో పెద్దాయపల్లి వద్ద స్కూల్ బిల్డింగ్ పనులు ప్రారంభించనున్నారు.