కేసీఆర్​ పరిశీలనకు ​పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్

కేసీఆర్​ పరిశీలనకు ​పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్
  • సీఎం కేసీఆర్​ పరిశీలనకు పంపించిన ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​
  • ఓకే అన్న వెంటనే కృష్ణా బోర్డుకు సమర్పణ
  • 3 నెలల్లో ప్రాజెక్టు అనుమతులు తెచ్చుకునేందుకు కసరత్తులు 
  • మిగులు జలాలు, దక్కాల్సిన వాటా ఆధారంగా అనుమతులు తెచ్చుకునే ప్లాన్​

హైదరాబాద్​, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. మహబూబ్​నగర్​, రంగారెడ్డి జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు డీటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ (డీపీఆర్​)ను ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ సిద్ధం చేసింది. దానిని సీఎం కేసీఆర్​ అనుమతి కోసం పంపించింది. సీఎం నుంచి గ్రీన్​ సిగ్నల్​ రాగానే డీపీఆర్​ను కృష్ణా బోర్డుకు సమర్పించి 3 నెలల్లో పర్మిషన్లు తెచ్చుకునేందుకు కసరత్తులు చేస్తోంది. మిగులు జలాల ఆధారంగా కడ్తున్న ఈ ప్రాజెక్టుకు ఇప్పటిదాకా హైడ్రాలజీ క్లియరెన్స్​ రాలేదు. దాని కోసం భారీ ఎక్సర్​సైజులే చేస్తోంది. రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల్లోని మిగులు వాటా, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే నీళ్లలో దక్కాల్సిన వాటాలను చూపించి ప్రాజెక్టుకు పర్మిషన్​ తెచ్చుకోవాలని ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ ప్రయత్నాలు చేస్తోంది.

ఆరు నెలల్లోగా తెచ్చుకోవాల్సిందే
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ ఈ ఏడాది జులై 15న కేంద్ర ప్రభుత్వం గెజిట్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్​ 14 నుంచే అది అమల్లోకి వచ్చేసింది. గెజిట్​ అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లోగా ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్టులకు పర్మిషన్లను తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వాటి పనులను ఆపేయాలి. ఇప్పటికే గోదావరిపై కడ్తున్న ఆరు ప్రాజెక్టుల అనుమతుల కోసం జీఆర్​ఎంబీకి ప్రభుత్వం డీపీఆర్​లను ఇచ్చింది. కృష్ణా నదిపై కడ్తున్న పెద్ద ప్రాజెక్టు ‘పాలమూరు–రంగారెడ్డి’ కావడంతో దానికి పర్మిషన్లు తెచ్చుకునేందుకు కసరత్తులను ముమ్మరం చేసింది. మిగులు జలాల ఆధారంగా కడ్తున్న ప్రాజెక్టు కావడంతో దీనికి సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చే అవకాశం లేదు. దీంతో అత్యంత కష్టమైన హైడ్రాలజీ క్లియరెన్సులను సాధించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వాడుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

‘మైనర్​’ మిగులు 7.5 టీఎంసీలు
రాష్ట్రానికి మైనర్​ ఇరిగేషన్​లో 89 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. మిషన్​ భగీరథలో భాగంగా చెరువులు పునరుద్ధరించకముందు చెరువుల ద్వారా నీటి వినియోగం 45 టీఎంసీలకు మించి ఉండేది కాదు. చెరువుల పునరుద్ధరణతో చెరువుల నీటి వాడకం 80 టీఎంసీలదాకా ఉంటోంది. అందులో ఏడాదికి సగటున 7.50 టీఎంసీల మిగులు జలాలున్నాయని సర్కారు లెక్క తేల్చింది. దానికి తోడు పోలవరం–పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం 80 టీఎంసీల గోదావరి జలాలను తరలిస్తోంది. దానికి బదులుగా నాగార్జునసాగర్​ ఎగువన అంతే మొత్తంలో నికర జలాలను తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వాడుకునేలా బచావత్​ ట్రిబ్యునల్​ అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రలు 35 టీఎంసీల నికర జలాలను వాడుకుంటున్నాయి. తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాల్సి ఉంది. దీనిపై కేంద్రం, కృష్ణాబోర్డుతో చర్చలూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సాగర్​కు ఎగువన ఉన్న శ్రీశైలం ఆధారంగా నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఈ 45 టీఎంసీలు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ ప్రతిపాదిస్తోంది. మొత్తం 45 రోజుల్లో 90 టీఎంసీలు ఎత్తిపోసేలా పాలమూరు పనులు చేస్తున్నారు. ఇందులో 52.50 టీఎంసీల నికర జలాలు ఉన్నాయని చెప్తున్నారు. మొదటి దశలో ఉద్ధండపూర్​ వరకే పనులు చేస్తుండటంతో అక్కడి వరకు ఈ నీటితో అనుమతులు పొందాలని ప్రయత్నిస్తున్నారు.

డీపీఆర్​లో అన్ని వివరాలు
ప్రాజెక్టులో భాగంగా కడ్తున్న నార్లాపూర్​, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండపూర్​ రిజర్వాయర్లు, ఎల్లూరు, ఏదుల, కరివెన, ఉద్ధండపూర్​ పంప్​హౌస్​లు, సబ్​స్టేషన్లు, అండర్​ గ్రౌండ్​ టన్నెళ్లు, గ్రావిటీ కెనాళ్లు, ఇతర నిర్మాణాల కోసం సేకరించిన, సేకరించాల్సిన భూములు, నిర్వాసితులు సంఖ్య, వారికి ఆర్​ అండ్​ ఆర్​ ప్యాకేజీ (పరిహారం), అటవీ భూముల సేకరణ, ఎస్టిమేట్స్​, కాస్ట్​ బెనిఫిట్​ రేషియో, ఎత్తిపోతలకు అవసరమైన కరెంట్​ తదితర వివరాలన్నింటినీ  డీపీఆర్​లో పొందుపరిచారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలు, పక్క రాష్ట్రంపై పడే ప్రభావాలను వివరించారు. రైతుల నుంచి భూసేకరణకు పబ్లిక్​ హియరింగ్​ నిర్వహించడం, అటవీ భూముల సేకరణకు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖతో జరిపిన చర్చలు, ఎన్విరాన్​మెంట్​ క్లియరెన్స్​ కోసం టెక్నికల్​ అడ్వైజరీ కమిటీని అప్రోచ్‌‌‌‌‌‌‌‌ కావడం సహా అన్ని విషయాలను డీపీఆర్​లో వివరించారు.