
- రోజుకు 4 గంటలే వాటర్ సప్లై గాజా క్యాంపుల్లో పాలస్తీనియన్ల దుస్థితి
- హాస్పిటల్స్‌లో మందులు, ఎక్విప్మెంట్లకు తీవ్ర కొరత
- గాయాలతో చిన్నారుల నరకయాతన
- ఆగని ఇజ్రాయెల్ వైమానిక దాడులు
గాజా/జెరూసలెం : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాను వదిలి వెళ్లేందుకు ఇష్టపడని లక్షలాది మంది పాలస్తీనియన్లు ఇంకా రిలీఫ్ క్యాంపుల్లోనే తలదాచుకుంటున్నారు. అక్కడ సరైన సౌలతుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాక్టర్లు, నర్సులు తమ ప్రాణాలకు తెగించి గాయపడిన వాళ్లకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రిలీఫ్ క్యాంప్‌లో 50 వేల మందికి కేవలం నాలుగు టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయని అమెరికాకు చెందిన ఎమిలీ కల్లాహన్ వివరించింది. ‘డాక్టర్స్ వితౌట్ బార్డర్స్’ అనే అమెరికన్ స్వచ్ఛంద సంస్థలో ఎమిలీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. గాజాలోని రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న పరిస్థితిని వివరించింది. ‘‘ప్రాణాలకు తెగించి గాయపడిన వాళ్లను కాపాడుతున్న డాక్టర్లే అసలైన హీరోలు. గాజాలో సేఫ్ ప్లేస్ లేదు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో తిరిగి యూఎస్‌కు వచ్చేయాల్సి వచ్చింది. 26 రోజుల తర్వాత ఫస్ట్ టైమ్ నేను సేఫ్‌గా ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను”అని ఎమిలీ కల్లాహన్ తెలిపింది.
26 రోజుల్లో 5 ప్లేస్‌లు మార్చాం
‘‘భద్రతాపరమైన కారణాల వల్ల 26 రోజుల్లో ఐదు సార్లు ప్లేస్ మారాల్సి వచ్చింది. కమ్యూనిస్ట్ ట్రైనింగ్ సెంటర్లో కొన్ని రోజులు ఉన్నాం. అక్కడి షెల్టర్‌లో 35 వేల మంది పాలస్తీనియులు ఉన్నారు. కాలిన గాయాలు, విరిగిన కాళ్లు, చేతులకు కట్టు కట్టుకుని తిరుగుతున్న పిల్లలు చాలా మందే ఉన్నారు. హాస్పిటల్స్ కిక్కిరిసిపోవడంతో పిల్లలను వెంట వెంటనే డిశ్చార్జి చేస్తున్నారు. యాబై వేల మందికి నాలుగు టాయిలెట్లే ఉన్నాయి. రోజుకు కేవలం 4 గంటలే నీళ్లు వస్తాయి. గాయపడిన తమ పిల్లలను తీసుకొచ్చి కాపాడాలని పేరెంట్స్ వేడుకున్నారు. కానీ, మా వద్ద హాస్పిటల్ ఎక్విప్మెంట్లు లేవు”అని ఎమిలీ వివరించింది.
Also Read :- బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై రైడ్స్ ఎందుకు జరగడం లేదు
అక్కడ వేధింపులు మొదలవడంతో ఆ క్యాంప్‌ను వదలాల్సి వచ్చిందని తెలిపింది. తమ వాళ్లను కోల్పోయిన చాలా మంది ఇజ్రాయెల్‌పై కోపంగా ఉన్నారని వివరించింది. ‘అమెరికన్’ అంటూ తనపై అరిచారని చెప్పింది. అమెరికన్లను దేశద్రోహులంటూ పిలిచారని తెలిపింది. పాలస్తీనియన్ కొలిగ్స్ ఎప్పుడూ తనవెంటే ఉన్నారని చెప్పింది. తను ఎక్కడికి వెళ్లదని, ఇక్కడే ఉంటుందని అంటూ పాలస్తీనా కొలిగ్స్ అక్కడివాళ్లకు చెప్పినట్లు ఎమిలీ వివరించింది.
సొరంగాలే టార్గెట్‌గా దాడులు
గాజాలోని సొరంగాల్లో దాక్కున్న హమాస్ టెర్రరిస్ట్‌లను ఇజ్రాయెల్ సైన్యం వేటాడుతున్నది. ఇజ్రాయెల్ దళాలు టన్నెల్స్‌ను రౌండప్ చేసి పేల్చేస్తున్నాయి. వందల కిలో మీటర్ల పొడవైన టన్నెల్స్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసేందుకు కంబాట్ ఇంజినీరింగ్ కోర్ పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నది. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ కు ఇరాన్ మద్దతుగా నిలిచే ప్రయత్నం మానుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. హమాస్ ఎప్పుడూ చూడని దాడులతో ఇజ్రాయెల్ ముందుకు సాగుతున్నదన్నారు. గాజాను ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టాయని తెలిపారు. గాజా అతిపెద్ద టెర్రరిస్ట్ క్యాంప్‌గా మారిందని డిఫెన్స్ మినిస్టర్ యోవ్ గల్లాంట్ మండిపడ్డారు. హమాస్ మొత్తాన్ని అంతం చేస్తామన్నారు.
పని చేస్తున్న హాస్పిటల్‌కే తమవాళ్ల డెడ్‌బాడీలు
గాజాలో తాను పని చేస్తున్న హాస్పిటల్‌కు తీసుకొచ్చిన తన పిల్లలు, అన్నదమ్ముళ్లు, అమ్మ డెడ్‌బాడీలను చూసిన ఓ డాక్టర్ కన్నీరుమున్నీరయ్యాడు. ఖాన్ యూనిస్‌లోని నసీర్ హాస్పిటల్లో ఇయాద్ షకురా డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. సోమవారం సాయంత్రం అతని ఇద్దరు పిల్లలు, ఇద్దరు అన్నదమ్ముళ్లు, తల్లి డెడ్‌బాడీలు మార్చురీలోని ఎమర్జెన్సీరూమ్కు వచ్చాయి. ఇది చూసిన ఇయాద్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సౌత్ గాజాలోని ఖాన్ యూనిస్ టౌన్ లో వీళ్లు ఉంటున్న ఇంటిపై వైమానిక దాడి జరిగింది. ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్‌పై బాంబులు, పేలుడు పదార్థాలు వేయడానికి వారేం తప్పు చేశారని ఆయన రోదిస్తూ ప్రశ్నించారు.
మహిళా పోలీసును చంపిన బాలుడు.. అతడిని కాల్చేసిన పోలీసులు
జెరూసలెంలో పెట్రోలింగ్ నిర్వహిస్తోన్న ఓ మహిళా పోలీసును 16 ఏళ్ల పాలస్తీనియన్ బాలుడు కత్తితో పొడిచి చంపాడు. అమెరికాలోని జార్జియాకు చెందిన ఎలిషేవా రోజ్ ఇడా లుబిన్ (20) అనే యువతి రెండేళ్ల క్రితం ఇజ్రాయెల్ కు వలస వచ్చింది. ఇజ్రాయెల్ బోర్డర్ పోలీస్ లో చేరింది. ఓల్డ్ జెరూసలెంలో విధులు నిర్వహిస్తోంది. మరో ఇద్దరు అధికారులతో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా 16 ఏళ్ల బాలుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మరో అధికారి వెంటనే స్పందించి బాలుడిని షూట్ చేశాడు. ఈ దుర్ఘటనలో ఆమెతో సహా బాలుడు కూడా మరణించాడు. రోజ్ లుబిన్ మృతికి జార్జియా గవర్నర్ బ్రియాన్ కెంప్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
మా వాళ్ల క్షేమం కోరుతూ దీపాలు వెలిగించండి
ఇజ్రాయెల్ రాయబారి విజ్ఞప్తి
న్యూఢిల్లీ : హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల క్షేమం కోసం దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక దీపాన్ని వెలిగించాలని భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిల్లాన్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. " అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. భారతీయులు రాముడిని ప్రార్థిస్తూ దీపాలతో దీపావళి వేడుక జరుపుకుంటారు. దయచేసి ఈ దీపావళికి హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు తిరిగి క్షేమంగా రావాలని కోరుతూ ఒక దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని ఫొటో తీసి #DiyaOfHopeకు ట్యాగ్ చేయండి" అని ఇండియన్లకు నౌర్ గిల్లాన్ విజ్ఞప్తి చేశారు.
హమాస్ రాకెట్ సప్లయర్ హతం
ఇజ్రాయెల్ హెచ్చరికలతో పాటు రిలీఫ్ క్యాంపుల్లో సౌలత్లు లేకపోవడంతో 20 వేల మంది పాలస్తీనియన్లు బుధవారం నార్త్ నుంచి సౌత్‌కు వెళ్లిపోయారు. ఇప్పటివరకు గాజా సిటీ నుంచి 70 శాతం మంది వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారుజామున వైమానిక దాడిలో హమాస్ మిలిటెంట్లకు రాకెట్స్ తయారు చేసి సప్లై చేసే ముహ్సిన్ అబు జినాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ముహ్సిన్కు వెపన్స్ తయారీలో అనుభవం ఉందని వివరించింది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ల నుంచి స్వాధీనం చేసుకున్న వెపన్స్‌కు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ ఆర్మీ బుధవారం రిలీజ్ చేసింది. యుద్ధం ముగిశాక గాజాను అధీనంలో ఉంచుకోవాలన్న ఆలోచన ఇజ్రాయెల్‌కు మంచిది కాదని అమెరికా సూచించింది. టోక్యో వేదికగా జరిగిన సమిట్ లో జీ7 దేశాల విదేశాంగ మంత్రులూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గాజాను దిగ్బంధించే చర్యలకు పాల్పడొద్దన్నారు.