
మాస్ హీరో అనే ఇమేజ్ వచ్చాక లవ్ స్టోరీస్ పక్కన పెట్టేస్తారు హీరోలు. కానీ ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాక కూడా ప్రభాస్ ఓ పూర్తిస్థాయి లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. అందుకే ‘రాధేశ్యామ్’ సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. లాస్ట్ ఇయర్ వేలంటైన్స్ డేకి ఫస్ట్ గ్లింప్స్‌తో పలకరించాడు ప్రభాస్. తాను రోమియోలా ప్రేమ కోసం చనిపోయే టైప్ కాదని చెప్పాడు. ఈసారి వేలంటైన్స్ డేకి మరో రొమాంటిక్ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు. సంక్రాంతికే రావాల్సిన ఈ మూవీ కొవిడ్ వల్ల ఆలస్యమైంది. దీంతో మళ్లీ ప్రేమికుల రోజు దగ్గర పడింది. ఈసారి హీరో హీరోయిన్స్ మధ్య లవ్ కెమిస్ట్రీని చూపించబోతున్నారు. ఫిబ్రవరి 14న రాత్రి ఎనిమిది గంటలకు హైదరాబాద్‌లోని కెమిస్ట్రీ క్లబ్లో థీమ్ పార్టీ అరేంజ్ చేస్తున్నారు. దీనికి టీమ్ అంతా హాజరవనున్నారు. జ్యోతిష్య పండితుడు విక్రమాదిత్యగా ప్రభాస్, అతని లవర్ ప్రేరణగా పూజాహెగ్డే నటిస్తున్న ఈ మూవీని రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సౌతిండియన్ లాంగ్వేజెస్‌లో జస్టిన్ ప్రభాకరన్.. హిందీలో మిథున్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అన్ని భాషల్లోనూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌ను తమన్ అందిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్‌తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది.