మెదక్లో పల్లె పోరుకు కసరత్తు

మెదక్లో పల్లె పోరుకు కసరత్తు
  • జనవరి 31తో ముగుస్తున్న పంచాయతీల పదవీకాలం
  • ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు
  • రిజర్వేషన్ల డేటాఅడిగిన ఎస్ఈసీ
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1,602 గ్రామ పంచాయతీలు  

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు కసరత్తు షురువైంది. జనవరి 31వ తేదీతో గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పంచాయతీ పాలకవర్గాల సమగ్ర నివేదికలు కోరి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని  ఎస్​ఈసీ కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.

ఈ మేరకు ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ కేంద్రాలు, అధికారుల నియామకం, ఓటర్ జాబితా ఇతరత్రా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించింది. ఈ నెల 30వ తేదీలోగా అవసరమైన సిబ్బందిని సర్దుబాటు చేసుకుని వివరాలు టీ-పోల్ సాఫ్ట్ వేర్ లో నమోదు చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. వార్డుల యూనిట్ల ఆధారంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల నగారా ఎప్పుడు మోగుతుందో అని పొలిటికల్ లీడర్లు ఎదురుచూస్తున్రు.  సర్పంచ్​లు, వార్డు మెంబర్ల కోసం పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే ఎమ్మెల్యేల వద్ద పైరవీలు చేస్తూ పోరుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,602 గ్రామ పంచాయతీలు ఉండగా,14,286 వార్డులు ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో 27 మండలాల్లో 467 పంచాయతీలు, 5,778 వార్డులు ఉన్నాయి. మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉండగా రెండు విడతల ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బంది మూడో విడత ఎన్నికల్లోనూ పాల్గొంటారు. ఈ క్రమంలోనే ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ ఆఫీసర్లను నియమించాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ శరత్ ను ఆదేశించింది.

ఇదిలా ఉంటే ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్దతుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2019లో జరిగిన పల్లెపోరులో మ్యాగ్జిమం బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సర్పంచులు గెలవగా, ఈసారి కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులు, వార్డ్ మెంబర్లుగా గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

మెదక్ జిల్లాలో..

మెదక్ జిల్లాలోని21 మండలాల పరిధిలో 469 పంచాయతీలు, 4,086 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఎక్కువగా బీఆర్ఎస్ మద్దతు దారులే సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా గెలిచారు. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం, మెదక్ అసెంబ్లీ స్థానంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపొందడంతో పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. జిల్లాలో మెజార్టీ పంచాయతీల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తోంది. మరో వైపు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ ఎస్ పంచాయతీల్లో గెలిచి పట్టు నిలుపుకోవాలని ఆశిస్తోంది. దీంతో గ్రామాల్లో అప్పుడే పంచాయతీ ఎన్నికల వాతావరణం మొదలైంది.

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో 486 పంచాయతీలు,  4,422 వార్డులు ఉన్నాయి. గతంలో ఎస్టీల కోసం  కొత్తగా ఏడు పంచాయతీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మల్లన్న సాగర్, కొండపొచమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజక్టుల నిర్మాణంతో 13 గ్రామాలు ముంపునకు గురవడంతో పంచాయతీల సంఖ్య తగ్గింది. జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల పరిధిలో ఓటరు జాబితాలు, రిజర్వేషన్‌‌ ప్రక్రియ, పోలింగ్‌‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాల పై  జిల్లా యంత్రాంగం  దృష్టిసారిస్తోంది. ఇదిలా ఉంటే ఐదేండ్ల కాలంలో సర్పంచ్ లు అభివృద్ధి కార్యక్రమాల కోసం సొంత డబ్బులను ఎక్కువగా వినియోగించారు. వీటికి సంబంధించిన  బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో పడ్డారు.