
మెదక్, వెలుగు: భారతీయ జనతా పార్టీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పంజా విజయ్ కుమార్ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు తన రాజీనామా లేఖను పంపించారు. నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సాఫ్ట్వేర్ఉద్యోగం వదులుకొని గత జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి నిజాంపేట జడ్పీటీసీ మెంబర్ గా గెలుపొందారు. 2023లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జిగా పనిచేస్తున్న ఆయన పార్టీలో సరైన గుర్తింపు లభించడం లేదని బీజేపీకి రాజీనామా చేశారు. గురువారం విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.