అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి

అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచాలి : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి

వరంగల్​ సిటీ, వెలుగు: బల్దియా అధికారుల ఫోన్​ నంబర్లు వార్డు ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రజల జవాబుదారీగా ఉండాలని, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా మేయర్ సమావేశ మందిరంలో ఆయన మేయర్  గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయితో కలిసి సమీక్ష నిర్వహించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని పరకాల నియోజకవర్గ 15, 16, 17 డివిజన్లలో అభివృద్ధి పనుల పురోగతి, పారిశుధ్యం నిర్వహణ, తాగునీరు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన పలు సమస్యలపై ఆరా తీశారు. మూడు డివిజన్లో 32 అభివృద్ధి పనులు చేపట్టామని, 18 పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులకు టెండర్ వేసి ప్రారంభించాలన్నారు.

 వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన తాగునీటి సరఫరా చేయాలన్నారు.  గాడిపల్లిలో తాగునీటి పైప్లైన్ ఇబ్బందిగా ఉందని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షిస్తూ 404 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించగా, 296 మంది లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు చెప్పారు. మిగిలిన 108 ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందజేయాలన్నారు. ధర్మారంలో మహిళల కొరకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  అనంతరం గ్రేటర్ వరంగల్ 66 డివిజన్లో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇన్​చార్జి ఎస్ఈ మహేందర్ వివరించారు. సమావేశంలో అడిషనల్​ కమిషనర్ జోనా, ఎంహెచ్ వో రాజారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.